అపోలో ఆసుపత్రిలో జయ.. వీడియో బయటకు..

20 Dec, 2017 11:15 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన టీటీవీ దినకరన్‌ మద్దతుదారుడు పీ వెట్రివేల్‌ ఈ వీడియోను విడుదల చేశారు.

జయ వీడియోను చాలా రోజులుగా విడుదల చేయాలనుకుంటున్నామని, అనివార్య కారణాల వల్ల అప్పుడు బయటపెట్టలేదని వెట్రివేల్‌ వెల్లడించారు. జయ మృతిపై ఏర్పాటైన కమిషన్‌ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు. సమన్లు అందిన తర్వాత ఆధారాలను కమిషన్‌ ముందు ఉంచుతామని వివరించారు. కాగా, ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో లాభపడేందుకు జయ వీడియో, ఫొటోలను దినకరన్‌ వర్గం ఇప్పుడు విడుదల చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను వాయిదా వేయాలనే పిటిషన్‌ ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. గురువారం(రేపు) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌ను శాంతి భద్రతల నడుమ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అపోలో ఆసుపత్రిలో జయ.. వీడియో బయటకు..

మరిన్ని వార్తలు