టీఆర్‌ఎస్‌కు వివేక్‌ రాజీనామా

25 Mar, 2019 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనుకున్నట్లే జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ సోమవారం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. తనకు ఎంపీ టికెట్‌ ఇవ్వనందుకు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన ఆయన...ఇవాళ అధికారికంగా టీఆర్‌ఎస్‌ను వీడారు. కేసీఆర్‌ నమ్మకద్రోహం వల్లే తనకు టికెట్‌ రాలేదని, నమ్మించి గొంతు కోశారని వివేక్‌ ఆరోపణలు గుప్పించారు. తనకు టికెట్‌ ఇవ్వకుండా ఉండేందుకే చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా, ప్రోటోకాల్‌ మాత్రం పాటించలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లో అవమానాలే జరుగుతాయని వివేక్‌ విమర్శించారు. కాగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో వివేక్‌ బీజేపీలో చేరతారనే ప్రచారం గత రెండు రోజులుగా జరిగింది. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ధైర్యం చేయలేదు. దీంతో వివేక్‌ ఏకంగా లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి...(కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారు: వివేక్‌)

సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తదితరులు వివేక్‌తో సంప్రదింపులు జరిపినా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కాగా పార్టీ అభ్యర్థిగా  గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండుసార్లు బయటకు వచ్చిన నేపథ్యంలో సెంటిమెంట్‌గా కూడా మరోసారి పార్టీలో చేరేందుకు వివేక్‌ ససేమిరా అన‍్నారట. (అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!)

మరిన్ని వార్తలు