వైఎస్సార్‌ సీపీలో చేరిన బీజేపీ నాయకులు

1 Oct, 2018 12:32 IST|Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణిలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ కండువాలతో సాదరంగా వైఎస్‌ జగన్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది బీజేపీ కార్యకర్తలు కూడా వైఎస్సార్‌ సీపీలో చేరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికి సాధ్యం కాని ఘనత అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు లభిసున్న ప్రజాదరణ అపూర్వం అని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. 

వైఎస్‌ జగన్‌ను కలిసిన హుద్‌హుద్‌ తుపాన్‌ బాధితులు
జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను హుద్‌హుద్‌ తుపాన్‌ బాధితులు కలిశారు. మూడేళ్లయిన ప్రభుత్వం తమకు ఇళ్లు ఇవ్వలేదని జననేతకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల జాబితా ప్రకటించి మళ్లీ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇళ్లు అడిగితే అధికారులు డబ్బులు అడుగుతున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. మూడేళ్లుగా వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గీత, ఎంపీ అశోక్‌ గజపతిరాజులు తమను పట్టించుకోవడం లేదని అన్నారు.

థర్డ్‌ పార్టీ విధానం రద్దుపై సానుకూలత వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌ 
ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను కాంట్రాక్టు విద్యుత్‌ కార్మికులు కలిశారు. థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని జననేతకు వారు వినతిపత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచుతామని, క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వారు జననేతకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఉద్యోగుల విద్యార్హత ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాము వైఎస్ జగన్‌ మద్దతు తెలుపుతామని ప్రకటించారు.  

వైఎస్‌ జగన్‌ను కలిసిన శెట్టిబలిజ నేతలు
శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి వినతి పత్రం అందజేశారు. శెట్టిబలిజ కులాన్ని ఉత్తరాంధ్రలో తొలి నుంచి బీసీలుగా పరిగణించారని.. కానీ 2017 నుంచి ఓసీలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ధ్రువపత్రాలు విడుదల చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ వర్గానికి చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 

లోకల్‌ గవర్నమెంట్స్‌ ఛాంబర్‌ ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని ఛాంబర్‌ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు వినతి పత్రం అందజేశారు. అలాగే న్యాయవాదులు కూడా వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. 

జనసంద్రంగా విజయనగరం
మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్‌ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక రాజధాని విజయనగరం పట్టణంలో అడుగుపెట్టిన జననేతకు ప్రజలు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. పులివేషాలు, కోలాటం, గరగ నృత్యం, తప్పెట గుళ్లుతో స్వాగతం పలికి వైఎస్‌ జగన్‌పై తమ ప్రేమను చాటుకున్నారు. పట్టణంలోని రోడ్లన్ని జనసంద్రంగా మారాయి. విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో వైఎస్‌ జగన్‌ రాకకోసం వేల సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ సాయంత్రం మూడు లాంతర్ల జంక్షన్లో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రసగించనున్నారు.

>
మరిన్ని వార్తలు