చారిత్రక లోగిలి.. చీపురుపల్లి

27 Mar, 2019 07:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చీపురుపల్లి : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాలకు ఇది కేంద్ర బిందువుగా ఉంటోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. స్థానిక ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో చీపురుపల్లి నియోజకవర్గంపై వైఎస్‌ ఎంతో మక్కువ చూపించేవారు. అందుకే.. 2004 నుంచి 2009 వరకు అభివృద్ధి విషయంలో నియోజకవర్గం పరుగులు తీసింది. మహానేత వైఎస్‌ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పీసీసీ అ«ధ్యక్షునిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింతగా మార్మోగింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 

అపార అనుభవం 
రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ప్రత్యేక స్థానాన్ని పదిల పర్చుకున్నారు. మహారాజా కళాశాలలో 1978–80లో విద్యార్థి సంఘ నాయకునిగా ప్రస్థానం ఆరంభించిన బొత్స 1992–95లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 1995–99 వరకు డీసీసీబీ చైర్మన్‌ పదవి చేపట్టారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ తరఫున డీసీసీబీకి ఎన్నికైనది ఆయనొక్కరే. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి చెందినా 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి వైఎస్‌ కేబినేట్‌లో  మంత్రిగా పనిచేశారు.  అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌ కేబినేట్‌లోనూ పనిచేశారు.  2012లో మూడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తూర్పు కాపులకు బొత్స ఇప్పటికీ అండగా ఉంటున్నారు. 

వారసుడిగా వచ్చిన నాగార్జున 
సానుకూలాంశాలు 
మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని రాజకీయ వారసునిగా నాగార్జున ఈ ఎన్నికల్లో రంగప్రవేశం చేశారు. ఆయన లాస్‌ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సథరన్‌ కాలిఫోర్నియాలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ చదువుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఐదేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. 2014లో ఆయన తల్లి మృణాళిని ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 2016లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేశారు. కొన్నాళ్లకు జనని ఫౌండేషన్‌ సంస్థను స్థాపించి విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  
ప్రతికూలతలు 
జనని సంస్థ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అనధికార పరిశీలనలు చేశారు. ప్రభుత్వ సిబ్బందిపై పెత్తనం చెలాయించేవారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం మృణాళిని తన కుమారుడిని వేదికలపై కూర్చోబెట్టడం ద్వారా సొంత  పార్టీలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ సహకార విద్యుత్‌ సంఘం(ఆర్‌ఈసీఎస్‌)లో భారీ అవినీతి, ఉద్యోగాలు అమ్ముకోవడం వంటి ఆరోపణలతో మృణాళిని ప్రతిష్ట మసకబారింది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీవారే తీవ్రంగా వ్యతిరేకించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె కుమారుడు నాగార్జునకు టీడీపీ అధిష్టానం సీటు కట్టబెట్టింది. 

బాబు మర్చిపోయిన హామీలు 
చంద్రబాబు ఈ నియోజకవర్గానికి    ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. చీపురుపల్లిని రెవిన్యూ డివిజన్‌గా మారుస్తానని మాట తప్పారు. మెరక మూడిదాం మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గుర్ల మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదే మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. చీపురుపల్లి పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ వెటర్నరీ కళాశాల నిర్మిస్తామన్నారు. తరగతులు నేటికీ ప్రారంభం కాలేదు. తోటపల్లి పిల్ల కాలువలు పూర్తి చేస్తామని విస్మరించారు. 

మొత్తం ఓటర్లు    1,90,187 
పురుషులు    96,113 
మహిళలు    94,062 
ఇతరులు    12  

– బోణం గణేష్‌, సాక్షి ప్రతినిధి, విజయనగరం  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు