ఓటుకు కోట్లు కేసు: కేసీఆర్‌ కీలక భేటీ!

8 May, 2018 16:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  అత్యంత కీలకమైన ఓటుకు కోట్లు కేసునకు సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం మధ్యాహ్నం మరోసారి అధికారులతో సమావేశమయ్యారు. ఓటుకు కోట్లు కేసుతో పాటు, చంద్రబాబునాయుడు భూ అక్రమాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న అనేక కేసులకు సంబంధించి దర్యాప్తు పురోగతిని, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పూర్వాపరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు అధికారవర్గాలు తెలిపాయి. అనేకమైన కీలక కేసులపై తుది విచారణ పూర్తి చేయడానికి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ను నియమించే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. కీలకమైన కేసుల పురోగతిని పరిశీలిస్తూ ముందుకు తీసుకెళ్లడానికి అన్నింటినీ కలిపి ఒక ఒక ప్రత్యేక కమిషన్ నియమించడమా లేక కేసు తీవ్రతను బట్టి కమిషన్ నియమించడమా అన్నది ఇంకా తేలాల్సి ఉందని అధికారవర్గాలు చెప్పాయి..

ఓటుకు కోట్లు లంచాలు ఇస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నందున ఆయనను ఏ-1 నిందితుడిగా అభియోగాలు  నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కుట్రలో ఆయనే కీలకం అవుతారని న్యాయనిపుణులు ఇప్పటికే తేల్చిచెప్పారు. కేసులో ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొనాల్సి ఉంటుందని సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు.

‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు