ఓటుకు రెండు వేల రూపాయల నోటు!

1 May, 2018 13:01 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 12 రోజులు లేవు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తనవైపు తిప్పుకునేందుకు ధనభలం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన మార్చి 27వ తేద నుంచి ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తంలో 90 శాతం నోట్లు రెండువేల రూపాయలవే ఉన్నాయి. అంటే ఓటుకు నోటుకున్న డిమాండ్‌ రెండు వేల రూపాయలకు చేరుకుందని దీన్నిబట్టి తెలుస్తోంది.

2017లో తమిళనాడులోని రాధాకష్ణన్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సొమ్ము పెద్ద ఎక్కువ కాదని తెలుస్తోంది. తమిళనాడు నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలకు 86 కోట్ల రూపాయలను పంచారని తెలిసి ఎన్నికల కమిషన్‌ ఆ ఎన్నికను కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం డిసెంబర్‌లో నిర్వహించిన ఆ ఉప ఎన్నికల్లో డబ్బు కుప్పలు తెప్పలుగా చేతులు మారిందని తెల్సింది. నాటి ఎన్నికల్లో టీటీవి దినకరణ్‌ పాలకపక్ష అన్నా డిఎంకే, ప్రధాన ప్రతిపక్ష డిఎంకే అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దినకరణ్‌ రాధాకష్ణన్‌ నగర్‌ను సందర్శించినప్పుడు స్థానిక ప్రజలు 20 రూపాయల నోట్లను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఈ 20 రూపాయల నోట్లను తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు.

నాయకులు సంతకాలు చేసిన 20 రూపాయల నోట్లిచ్చి ఎన్నికల అనంతరం విజయం సాధిస్తే రెండువేలో, నాలుగువేల రూపాయలో ఇస్తామని తమిళనాడులో చెప్పారు. అది సరికొత్త పోకడ. అభ్యర్థి విజయం సాధిస్తేనే తమకు డబ్బులు వస్తాయని ఆశించి ఓటర్లు ఓట్లేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా డబ్బులు పంచకూడదంటూ అక్కడి రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ గట్టిగా హెచ్చరిస్తూ వస్తోంది. కానీ సరైన యాంత్రాంగం లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బులు పంచకుండా ఎన్నికల కమిషన్‌ నివారించలేకపోతోంది. రాజకీయ నాయకులు, జనం దష్టిలో ఓటుకు నోటు అనేది రోజు రోజుకు సాధారణ విషయంగా మారిపోతోంది. ఈ 12 రోజుల్లో కూడా కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగితే అది కచ్చితంగా బీజేపీకే లాభించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు