తాడిపత్రిలో ‘జేసీ’కి వ్యతిరేక పవనాలు..

3 Apr, 2019 12:48 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి : తాడిపత్రినియోజకవర్గం.. అనంతపురం జిల్లాలోని ఈ సిగ్మెంట్‌లో జేసీ కుటుంబీకులదే హవా..జేసీ కుటుంబసభ్యులే ఏడుసార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తాడిపత్రి ఓటర్లు జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.  

తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. దివాకర్‌రెడ్డి అనంతపురం ఎంపీగా గెలుపొందారు.

అయితే ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్‌  ప్రత్యక్షరాజకీయాల నుంచి విశ్రమించారు. వారి వారసులను బరిలోకి దించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీచేస్తున్నారు. 

జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా..
స్థానికంగా జేసీ దివాకర్‌ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. అయితే  ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాడిపత్రిలో అరాచకం ఎక్కువైంది. ‘లగాన్‌’ బ్యాచ్‌ పేరుతో ఒక బృందం జేసీ కనుసన్నల్లో గ్రానైట్‌ పరిశ్రమను పీల్చిపిప్పి చేసింది. గెర్డావ్‌ పరిశ్రమలో కూడా ఉద్యోగాలు, వాహనాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ జేసీ కనుసన్నల్లో సాగుతున్నాయి. చివరకు మునిసిపల్‌ కాంప్లెక్స్‌లు కూడా జేసీ చెప్పిన వారికే అధికారులు కేటాయిస్తున్నారు. ఇన్నేళ్లుగా వారికి ఎదురు చెప్పలేకపోయిన తాడిపత్రి వాసులు ఇప్పుడు గళం విప్పుతున్నారు.

తాడిపత్రిలో పాత టీడీపీ ఖాళీ!
జేసీ బ్రదర్స్‌ సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినప్పుడు వారితో కేడర్‌ టీడీపీలోకి రాలేదు. కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పటి వరకూ జేసీపై పోటీ చేస్తూ వచ్చిన పేరం నాగిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.  ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి తదితరలు జేసీకి అండగా నిలిచి టీడీపీని గెలిపించారు. ఆ తర్వాత వారిని జేసీ బ్రదర్స్‌ దూరం పెట్టారు. ఇది తట్టుకోలేక వారంతా జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇది జేసీ బ్రదర్స్‌కు కోలుకోలేని దెబ్బ. ఇక అన్ని రకాలుగా అండగా ఉన్న భోగాతి నారాయణరెడ్డి కుటుంబం కూడా జేసీ బ్రదర్స్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరింది. ఇలా అందరూ వెళ్లిపోవడంతో బ్రదర్స్, వారి వారసులు మినహా చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కరూ కూడా జేసీతో ప్రస్తుతం లేరు.  

అస్మిత్‌కు అంతా వ్యతిరేకం..
రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న జేసీ అస్మిత్‌రెడ్డి, బలమైన పెద్దారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా లేవు. అందరిపై నోరు పారేసుకోవడం, తాడిపత్రి తమ సొత్తు అనేలా ప్రవర్తిస్తుండటతో  జేసీ బ్రదర్స్‌ అంటే తాడిపత్రి ప్రజలకు మింగుడుపడని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అస్మిత్‌రెడ్డి నెగ్గుకురావడం కష్టమే అనే చర్చ సాగుతోంది. 

ఆత్మవిశ్వాసంతో పెద్దారెడ్డి 
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ బ్రదర్స్‌ను గట్టిగా నిలువరించారు. దీంతో భారీగా పార్టీలో చేరారు. పెద్దారెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. తాను గెలిస్తే తాడిపత్రికి వాక్‌స్వాతంత్య్రం తీసుకొస్తానని పెద్దారెడ్డి చెబుతూ ప్రజలను 
ఆకర్షిస్తోంది. 

మొత్తం ఓటర్లు: 2,20,678
పురుషులు : 1,10,923
మహిళలు : 1,09,745

– మొగిలి రవివర్మ, సాక్షిప్రతినిధి, అనంతపురం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు