నారాయణా.. తగునా!

2 Apr, 2019 08:33 IST|Sakshi
కలెక్టర్‌ వీరపాండియన్‌కు ఈవీఎంల గురించి వివరిస్తున్న ఎన్నికల తహసీల్దారు భాస్కర్‌ నారాయణ

ఓటరు జాబితా లీక్‌  

సాక్షి, అనంతపురం అర్బన్‌: రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితా అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో అందించాలి. అయితే ఈ విషయం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు కొందరు తిరకాసు తంతుకు తెరతీశారు. టీడీపీ నేతలతో ఉన్న స్నేహంతో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గంలోని టీడీపీకి నేతలకు మూడు రోజులు ముందుగానే ఓటరు జాబితాను అందజేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల తహసీల్దారుగా వ్యహరిస్తున్న సి.భాస్కర్‌నారాయణ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను ఉన్నతాధికారులు కొనసాగిస్తుండడం విమర్శులు ఉన్నాయి. 

ఆ రెండు నియోజకవర్గాలకు ఎలా వెళ్లింది.? 
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితాను అందజేస్తామని సమాచారం ఇవ్వాలని ఆర్‌ఓ, ఈఆర్‌ఓలకు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మార్చి 31న వాట్స్‌ప్‌ మెసేజ్‌ పెట్టారు. దీంతో అభ్యర్థులు ఏప్రిల్‌ ఒకటిన జాబితా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు విరుద్ధంగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు మూడు రోజుల ముందేగా జాబితా చేరిపోయింది. దాన్ని పట్టుకుని టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతున్నారు. 


ధర్మవరం నియోజకవర్గానికి     ముందుగానే చేరిన ఓటర్ల జాబితా  

ఎన్నికల తహసీల్దారుపై ఆరోపణ..     
ఓటరు జాబితా ముందుగానే టీడీపీ నేతలకు అందడం వెనుక ఎన్నికల తహసీల్దారుగా కొనసాగుతున్న భాస్కర్‌నారాయణపై హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ధర్మవరం టీడీపీ అభ్యర్థి జి.సూర్యానారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అంతే కాకుండా సదరు నేతకు ఆయన క్లాస్‌మెట్‌ కూడా అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు షెడ్యూల్‌ కంటే ముందుగానే ఓటర్ల జాబితా అందించడం వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. 

పర్సెంటేజీ దందా:  
ఎన్నికల విభాగంలో ఏళ్లగా తిష్టవేసిన భాస్కర్‌నారాయణ పర్సెంటేజీ, కమిషన్‌ దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి స్టేషనరీ, ఫ్లెక్సీలు, కరపత్రాలు, ఓటర్ల జాబితా ముద్రణ ఇలా ప్రతి దాంట్లోనూ ఆయనకు కమిషన్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నా యి. ఈ కారణంగానే ఆయన రాజకీయ అండతో ఆ సీటు వదలకుండా ఏదో ఒక రకంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగింపు: 
భాస్కర్‌నారాయణకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఆయన్ను ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో వాస్తవాన్ని కప్పిపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కూడా ఉన్నతాధికారులు తప్పుదారి పట్టించినట్లు విమర్శులు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ భాస్కర్‌నారాయణ సేవలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో భాస్కర్‌ నారాయణ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. విభాగం సిబ్బందితో ఇష్టానుసారంగా మాట్లాడడం, వారిపై ప్రతి చిన్న విషయానికి ఆగ్రహించడం జరుగుతోందని కొందరు సిబ్బంది వాపోయారు.  

విచారణ చేయిస్తాం ..
ఓటరు జాబితా కావాలనుకునే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అర్జీ ఇస్తే...ఓటర్ల ఫొటోలు లేకుండా సాఫ్ట్‌ కాపీ (సీడీ) ఇస్తాం. అభ్యర్థులు వచ్చి ఓటర్ల జాబితా తీసుకోవాలని మార్చి 31న సమాచారం పంపాము. అయితే ధర్మవరం నియోజకవర్గానికి ఫొటో ఓటర్ల జాబితా ముందుగానే ఎలా ఇచ్చారు..? ఎవరు ఇచ్చారు..? అనే దానిపై విచారణ చేస్తాం. 

ఎస్‌.డిల్లీరావు,జాయింట్‌ కలెక్టర్‌   

మరిన్ని వార్తలు