ఓటరు కన్నెర్ర

30 Apr, 2018 09:33 IST|Sakshi
రూ.20 నోట్లతో ఆందోళన చేస్తున్న మహిళలు

రూ. 20 పట్టు...పది వేలు కొట్టు

దినకరన్‌ను చుట్టుముట్టినమహిళలు

ఆర్కేనగర్‌లో ఎమ్మెల్యే ఘోరావ్‌

సాక్షి, చెన్నై : దినకరన్‌కు బ్రహ్మరథం పట్టిన ఆర్కేనగర్‌ ఓటరు ప్రస్తుతం తిరగబడే పనిలో పడ్డారు. రూ.20 నోట్లను చేత పట్టి.. రూ. పది వేలు కొట్టు అన్న నినాదంతో ఆదివారం దినకరన్‌ను మహిళలు చుట్టుముట్టారు. తన నియోజకవర్గ ప్రజలు ఘోరావ్‌ చేయడంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరయ్యారు.

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే డిపాజిట్లు గల్లంతు కాగా, అన్నాడీఎంకేను ఢీ కొడుతూ భారీ ఆధిక్యంతోనే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఓటుకు నోటు తాండవం గుట్టు రట్టుతో గతంలో ఉప ఎన్నిక రద్దును పరిగణించిన దినకరన్‌ ఈసారి కొత్త బాణి అనుసరించారని ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నోట్లు చల్లినా, మరికొన్ని చోట్ల గెలుపు తదుపరి నోటు అంటూ కొత్త మార్గాన్ని అనుసరించారని ప్రచారం. ఓటుకు నోటుకు చిహ్నంగా రూ. 20 నోటును ఎన్నికల సమయంలో అందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తామిచ్చిన రూ. 20 నోటు ఎవరి వద్ద ఉందో వారందరికి గెలుపు తదుపరి రూ.10 వేలు ఇస్తామని నమ్మ బలికినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, గెలుపు తదుపరి ఆయన ఆ రూ.20 నోటు గురించి పట్టించుకోలేదని ఆగ్రహిస్తూ అనేకచోట్ల ఆందోళనలు సైతం సాగాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్కేనగర్‌ పర్యటనకు వచ్చిన దినకరన్‌ మీద బ్రహ్మరథం పట్టిన వాళ్లే తిరగబడడం గమనార్హం.

రూ.20 పట్టు.. రూ. పది వేలు కొట్టు  
ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే, అమ్మ మక్కల్‌ కళగం నే త టీటీవీ దినకరన్‌ ఆదివారం ఉదయం ఆర్కేనగర్‌ పరిధిలోని నేతాజీ నగర్‌లోని మురుగన్‌ ఆలయానికి వచ్చారు. అక్కడ జరిగిన  చిత్రా పౌర్ణమి ఉత్సవాలకు ఆయన  వస్తున్న సమాచారంతో ఓటర్లు తిరగబడేందుకు సిద్ధం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఓ వర్గానికి చెందిన వారు చుట్టుముట్టారు. ఘోరావ్‌ చేస్తూ, ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. పెద్ద సంఖ్యలో మహిళలు రూ. 20 నోట్లు ఇదిగో.. హామీ ఇచ్చినట్టుగా రూ.పదివేలు ఇవ్వు.. అంటూ ఆయన్ను నిలదీస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అదే సమయంలో దినకరన్‌ మద్దతుదారులు ఆందోళనకారుల మీద తిరగబడడంతో ఉద్రిక్తత తప్పలేదు.

పోలీసులు ఇరువర్గాల్ని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకున్న దినకరన్‌ ఆలయం వద్దకు వెళ్లి ఆగమేఘాలపై పూజలు చేసి మరో మార్గంలో దూసుకెళ్లారు. మరోచోట దినకరన్‌ చలివేంద్రం ఏర్పాటుకు వచ్చి తీరాల్సి ఉండడంతో, అక్కడే ఆందోళనకారులు బైఠాయించారు. చివరకు అటు వైపు రాకుండానే దినకరన్‌ జారుకున్నారు.  కాగా, దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారంతా అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారేనని, పని గట్టుకుని మరీ రాద్దాంతం చేసినట్టుగా దినకరన్‌ మద్దతుదారుడు వెట్రివేల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలే మేనమామ రూపంలో ఫ్యామిలీ వార్‌ ను ఎదుర్కొంటున్న దినకరన్‌కు తాజాగా రూ.20 నోటు రూపంలో ఓటరు తిరగబడే పనిలో పడడం మరింత శిరోభారంగా మారింది.

మరిన్ని వార్తలు