నువ్వెంత.. నువ్వెంత?

1 Jun, 2020 02:40 IST|Sakshi
ఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన నియంత్రిత సాగు సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వాదం

రుణమాఫీపై మంత్రి మాట్లాడుతుండగా అడ్డుతగిలిన ఉత్తమ్‌

మధ్యలో మాట్లాడటం సభామర్యాద కాదని జగదీశ్‌రెడ్డి హితవు

రసాభాసగా నియంత్రిత సాగు సన్నాహక సమావేశం

సాక్షి, నల్లగొండ : మంత్రి జగదీశ్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన వానాకాలం పంటల వ్యవసాయ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. జగదీశ్‌రెడ్డి రుణమాఫీపై మాట్లాడినప్పుడు ఉత్తమ్‌ అడ్డుతగిలారు. రుణమాఫీ ఎక్కడిచ్చారంటూ ప్రశ్నించారు. ఇలా మధ్యలో మాట్లాడటం సభామర్యాద కాదని, గౌరవాన్ని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. అయినా ఉత్తమ్‌ తగ్గకుండా రుణమాఫీ కాలేదని మరోసారి చెప్పారు. ‘సీనియర్‌ నాయకుడివి మధ్యలో మాట్లాడడం సరికాదు. నీవు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు నువ్వుకూడా వినాలి’అని జగదీశ్‌రెడ్డి సూచించారు. దీంతో ఉత్తమ్‌ స్పందిస్తూ.. ‘రుణమాఫీ కాలేదు, మీరు అబద్ధం చెబుతున్నారు’ అని అనడంతో మంత్రి కాస్త సీరియస్‌ అయ్యారు. ‘తెలివిలేని మాటలు మాట్లాడొద్దు. ఇది డిబేట్‌ కాదు. కూర్చోవాలి. ఇది అసెంబ్లీ, పార్లమెంట్‌ కాదు.. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి.. ఇది రైతుల కోసం పంటల సాగు విషయంలో వారిని బాగుచేసేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం’ అని గట్టిగా చెప్పారు. 

మీడియా కోసం డ్రామాలు..
‘మీడియా కోసం ఉత్తమ్‌ డ్రామాలు ఆడుతున్నారు.. మంత్రిగా నేను మాట్లాడుతున్నా.. ఇది నా హక్కు.. నీవు మధ్యలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు? కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులను మీరు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ లెక్కలతో సహా చెబుతుంటే.. నేను ప్రిపేర్‌ కాలేదంటూ పారిపోయావు’అని ఉత్తమ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నేను పోలేదని ఉత్తమ్‌ స్పందించగా.. ‘నేను సభలోనే ఉన్నా. నువ్వు మాట్లాడటం చేతకాక పారిపోయి రైతులకు మంచి చేస్తున్న మాపై విమర్శలు చేస్తున్నావు. దేశంలో ఎక్కడా రుణమాఫీ అమలు కాలేదు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదు. తెలంగాణలో జరిగింది’అని మంత్రి పేర్కొన్నారు. దీంతో ‘మర్యాదగా మాట్లాడు’అని ఉత్తమ్‌ అనగా.. ‘నీవు ఎలా మాట్లాడుతున్నావో, నేను ఎలా మాట్లాడుతున్నానో ప్రజలు, మీడియా గమనిస్తున్నారు. అయినా, ఇది డిబేట్‌ కాదు’అని మంత్రి అనడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. దీంతో ఓ దశలో ఆఫ్ట్రాల్‌ నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. నిన్ను ఎంపీగా ఎన్నుకోవడం జిల్లా ప్రజలకు దరిద్రమని మంత్రి అనగా.. నిన్ను మంత్రిగా ఎన్నుకోవడం కూడా ప్రజలకు దరిద్రం అంటూ ఉత్తమ్‌ దుయ్యబట్టారు. 

ఎక్కడైనా చర్చకు సిద్ధం..
ఈ క్రమంలో మంత్రి మరింత ఆవేశంతో మాట్లాడారు. రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టంచేశారు. ‘దీనిపై ఎక్కడైనా వేదిక పెట్టండి.. నేను సిద్ధం. విత్తనాలు, ఎరువులు తదితర వాటిపై కూడా చర్చకు సిద్ధం’అని సవాల్‌ చేశారు. 2014 ముందు లాఠీచార్జ్‌ లేని రోజు లేదని విమర్శించారు. ఎరువుల కోసం లైన్లు, విద్యుత్‌ కోసం ధర్నాలు నిత్యం జరిగేవని.. ఇప్పుడు కేసీఆర్‌ అడగకుండానే రైతులకు అన్నీ చేస్తున్నారనే సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి రైతులకు మాట్లాడే అవకాశం లేదా అంటూ ప్రశ్నించగా.. ‘లేదు. నీకు అసలే లేదు. వచ్చినోడివి కూర్చోవాలి తప్ప తెలివిలేని మాటలు మాట్లాడొద్దు’అని మంత్రి బదులిచ్చారు. అలాంటప్పుడు ఈ మీటింగ్‌ ఎందుకని దుబ్బాక ప్రశ్నించగా.. నీకు ఇష్టం లేకపోతే వెళ్లిపో అని మంత్రి సూచించారు. ‘హీ ఈజ్‌ నాట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద మీటింగ్‌. అతడిని బయటికి పంపించండి’అని జగదీశ్‌రెడ్డి పేర్కొనడంతో పోలీసులు దుబ్బాకను బయటికి పంపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు