రోజుకు రెండు లక్షల మంది చస్తారట!

15 Apr, 2019 19:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 2024 సంవత్సరం నాటికి దేశంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ప్రజల మంచినీటి సదుపాయానికి, దేశంలో జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గంగా నదిని ప్రక్షాళిస్తానంటూ హామీ ఇచ్చారు. గంగా జలాల ప్రక్షాళన కోసం స్వామి సనంద్‌గా గుర్తింపు పొందిన జీడీ అగర్వాల్‌ ఆమరణ దీక్ష చేస్తూ మరణించినప్పటికీ గంగా జలాల ప్రక్షాళనలో పెద్దగా కదలిక లేదు. 

గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ మోదీ హామీ ఇచ్చినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల రక్షిత మంచినీటి సౌకర్యం పథకాలకు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చారు. నేడు దేశంలో కోట్లాది మంది ప్రజలు మంచినీటి కోసం అల్లాడి పోతున్నారు. అందుకనే నేడు దేశంలో పలు చోట్ల మంచినీళ్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసే వరకు ఓట్లు వేయమంటూ కేరళలోని కుట్టానడ్‌ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఎలాంటి మంచినీటి సౌకర్యాలు మెరగుపరుస్తారో, మురుగునీరు పారుదలకు ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకుంటారో ముందు వివరించండంటూ ఐటీ కారిడార్‌ పరిధిలోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్స్‌’ ఎన్నికల ప్రచారానికి వస్తున్న అభ్యర్థులను నిలదీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా భూగర్భ జలాలు అంతరించి పోతుండడం వల్ల జల వనరుల కోసం ఒత్తిడి పెరుగుతోంది. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2020 నాటికి 21 నగరాల పరిస్థితి
మరో ఏడాది కల్లా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు అంతరించి పోతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 75 శాతం ఇళ్లకు మంచినీరు అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్న ఇళ్లలో కూడా 70 శాతం ఇళ్లకు కలుషిత జలాలే వెళతాయి. ఫలితంగా తాగునీరు అందుబాటులో లేక రోజుకు రెండు లక్షల మంది ప్రజలు చనిపోతారట. 2030 నాటికి నీటి సరఫరాకన్నా రెట్టింపు ఉంటుందట. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా జల వనరుల పరిరక్షణ, అభివద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు. ఎప్పటిలాగా పాలకులు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి తప్పుకోకుండా దేశంలో జల వనరుల అభివద్ధికి చర్యలు తీసుకోవాలంటే విద్య ప్రాథమిక హక్కు తరహాలో ‘మంచినీరును ప్రాథమిక హక్కు’గా మార్చాలి.


 

మరిన్ని వార్తలు