రాహుల్‌గాంధీని ఓడిస్తాం

2 Apr, 2019 04:35 IST|Sakshi

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం మాది

‘సాక్షి’తో సురవరం సుధాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిపై పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటమికి వామపక్షాలు అన్ని చర్యలు తీసుకోనున్నట్టు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను కూడగట్టేందుకు తాము కృషి చేస్తుంటే, అందుకు విరుద్ధంగా వామపక్షాలపైనే కాంగ్రెస్‌ పోటీకి దిగడం దారుణమని ధ్వజమెత్తారు. సీపీఐ పోటీలో ఉన్న చోట రాహుల్‌గాంధీ బరిలో దిగాలనుకోవడం మంచి సంకేతం కాదని వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రత్యక్ష పోరులో ఉన్న కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలు కాదని కేరళ నుంచి రాహుల్‌ పోటీకి దిగడం అర్థరహితమని సోమవారం సురవరం ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి రాహుల్‌ పోటీచేయడాన్ని వామపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ స్థానం కాంగ్రెస్‌కు, మరీ ముఖ్యంగా రాహుల్‌గాంధీ గెలిచేంత సురక్షితమైనది కూడా కాదన్నారు. వాయనాడ్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో వామపక్షాల ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పారు. ఈ స్థానంలో సీపీఐ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తమను కోరడం అర్థం లేనిదన్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాయనాడ్‌ నుంచి తన నామినేషన్‌ను రాహుల్‌గాంధీ ఉపసంహరించుకోవాలని సురవరం సూచించారు.  

కేడర్‌లో ఆగ్రహజ్వాలలు..
వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీకి దిగడం పట్ల వామపక్ష నాయకులు, కార్యకర్తల్లో ముఖ్యంగా సీపీఐ కేడర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని సురవరం తెలిపారు. పోటీకి నిర్ణయం వెలువడిన ఆదివారం రాత్రి నుంచి వరసగా కార్యకర్తలు ఫోన్లు చేసి కాంగ్రెస్‌ తీరుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో సీపీఐ పోటీచేయని స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు బలమైన లౌకికపార్టీ అభ్యర్థులకు (కాంగ్రెస్‌) ఓటు వేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలనే ఒత్తిడి తమపై పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు సీపీఐ ఎందుకు మద్దతివ్వాలనే ప్రశ్నలు ఎదురవుతున్నాయన్నారు. ఈ విధంగా తమ కంటే కూడా దేశవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ నష్టం జరగబోతోందన్నారు. కాంగ్రెస్‌కు మద్దతుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. తమ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పునరాలోచించుకో వాలని సురవరం సూచించారు.

మరిన్ని వార్తలు