కర్ణాటక: ఏ టెన్షన్‌ లేదు.. మాదే విజయం!

25 May, 2018 09:50 IST|Sakshi
కుమారస్వామి, యడ్యూరప్ప (ఫైల్‌ ఫొటో)

కర్ణాటక అసెంబ్లీలో నేడు బలపరీక్ష

సాక్షి, బెంగళూరు : తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, బల పరీక్షలో కచ్చితంగా తాము నెగ్గి తీరుతామని కర్ణాటక సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు సంఖ్యా బలం ఉన్నందున అంతిమ విజయం తమదేనన్నారు. మెజార్టీ లేకున్నా బీజేపీ అధికారం కోరుకున్నందున వారికి పరాభవం తప్పలేదన్నారు. నేటి బలపరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నెగ్గి గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా జరుగుతున్న పరిణామాలకు చెక్‌ పెట్టనున్నట్లు వెల్లడించారు.

కాగా, నేటి మధ్యాహ్యం 12:15 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకుంటారు. స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి కేఆర్‌ రమేష్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా సురేష్ కుమార్‌ నామినేషన్ వేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక అనంతరం కుమారస్వామి సర్కార్‌ బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్‌ ఎన్నిక, బలపరీక్షల నేపథ్యంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు హాజరు కానున్నారు.

విశ్వాస పరీక్షకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 104 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. దీంతో కుమారస్వామి ఈ బలపరీక్షలో సులువుగా నెగ్గుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇంకా బెంగళూరులోని రిసార్టుల్లోనే కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు