మన బిడ్డల్ని కాపాడుకోలేకపోయాం: వైఎస్‌ జగన్‌

17 Apr, 2018 00:54 IST|Sakshi

కథువా, ఉన్నావ్‌ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలి

ఆ శిక్షలే గుణపాఠాలు కావాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు

 ఏపీలోనూ మహిళలకు భద్రత కరువైందని ఆవేదన

సాక్షి, మైలవరం: ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్‌లో చోటుచేసుకున్న ఘోరాలు మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలని పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి నేరాలు చేయాలన్న తలంపు కూడా ఏ ఒక్కరికీ రాని విధంగా నిందితులను కఠిన శిక్షించాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువైన విషయాన్ని గుర్తుచేశారు.

‘‘మానవత్వం మంటగలిసిందనడానికి కథువా, ఉన్నావ్‌ ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం వైఫల్యం చెందాం. బాధకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి అంతకు తీసిపోలేదు. గతేడాది అక్టోబర్‌ 17న వైజాగ్‌ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగింది. డిసెంబర్‌లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టొద్దు. ఏఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు