వైఎస్ జగన్ ప్రకటనతో టీడీపీలో కలవరం: పేర్ని నాని

16 Feb, 2018 15:12 IST|Sakshi
వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని

ఎంపీల పదవికాలం జూన్ 6వరకు ఉంటుంది

హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామాలు

ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ప్రజల్లోనే తేల్చుకుంటాం

హోదా రాష్ట్రాలకు జీఎస్టీ పదేళ్ల సడలింపు చంద్రబాబుకు తెలియదా?

వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని విమర్శించారు. 'సంవత్సరం లోపు ఏదైనా స్థానం ఖాళీ అయితే ఎన్నికలు అక్కర్లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ ఇప్పుడు అధికారికంగానే ఈసీ రూల్స్ ప్రకారం 15 నెలల ముందుగానే హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ సీపీ ఎంపీలం రాజీనామా చేస్తున్నాం. ఎంపీల పదవికాలం జూన్ 6వరకు ఉంటుంది. ఎన్నికల చట్టం రూల్స్ ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళతామని' పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఎంపీల రాజీనామా ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే హోదా కోసం చేస్తున్న ఎంపీల రాజీనామా అంశాన్ని తప్పుదారి పట్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన రోజు నుంచి నేటి వరకూ అధికారమే పరమావధిగా మోసపూరిత రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంటుంటే కాపాడారు. నిరుద్యోగుల భవిష్యత్‌కు ప్రత్యేక హోదా పునాదిలా పనికొస్తుందని, హోదా వల్ల పెట్టుబడులు వస్తే పలు కంపెనీల్లో వేల, లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా కొనసాగుతున్నా.. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం తాము సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను అటకెక్కించారు. జీఎస్టీ విషయాన్నే తీసుకుంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పదేళ్ల పాటు సడలింపు ఉన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

తాను వ్యాపారం మానేశానని, వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెబుతారు. కానీ చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు వ్యాపారాలు చేయడం నిజం కాదా. దీంతో పాటు చంద్రబాబు తన తల్లి పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నా.. వ్యాపారాలతో తనకు సంబంధం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయాలన్న ఆలోచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదని, అది కేవలం చంద్రబాబు నైజమని పేర్కొన్నారు. అందుకే కేసుల్లో ఇరుక్కోవడమే ఆలస్యం స్టేలు తెచ్చుకునే అలవాటున్న నేత చంద్రబాబు ఒక్కరేనని వైఎస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు.

మరిన్ని వార్తలు