ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కీలక ప్రకటన

3 Nov, 2019 13:34 IST|Sakshi

రంగులు మారుతున్న మహారాష్ట్ర రాజకీయం

170 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్న రౌత్‌

రేపు సోనియాతో, శరద్‌ పవార్‌ భేటీ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కూటమిగా పోటీ చేసిన శివసేన-బీజేపీలు ఎన్నికల ఫలితాల అనంతరం పదవుల పంపకాలపై పోటీకి దిగాయి. దీంతో ఫలితాలు ఏర్పడి 15 రోజులు గడుస్తున్నా చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అడుగులు వేడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము తలచుకుంటే బీజేపీ అవసరం లేకుండా రేపటిలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమకు 175 ఎమ్మెల్యే మద్దతు ఉందంటూ కొత్త ట్విస్ట్‌కు తెరలేపారు. రౌత్‌ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో బీజేపీ  నేతలు అప్రమత్తయ్యారు.

ఇదిలావుండగా.. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీయే అని ఫడ్నవిస్‌ ఇదివరకే ప్రకటించారు. పదవుల ఆశలో శివసేన నేతలు ఉన్నారని, వారి కలలన్నీ నిజాలు కాలేవని చురకలు అంటించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో కాంగ్రెస్‌ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సోనియా గాంధీలో పవార్‌ భేటీ కానున్నారు. అంతకుముందే శరాద్‌ పవర్‌తో సంజయ్‌ రౌత్‌ సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు ముంబై వర్గాల సమాచారం. అయితే ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా అన్న చర్చ మరాఠా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. (చదవండి: పవార్‌తో పవర్‌ పంచుకుంటారా?)

ఇక నవంబర్‌ 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పీటముడి మరింత బిగుసుకుంది. అధికారం కోసం చావో రేవోకో సిద్ధపడిన శివసేన పవార్‌తో పవర్‌ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు