మోదీ అశ్వమేధ గుర్రాన్ని కట్టేశాం

24 May, 2018 02:04 IST|Sakshi
పరమేశ్వరను అభినందిస్తున్న కుమారస్వామి

బెంగళూరు/మైసూరు: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాల అశ్వమేధ గుర్రాన్ని కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి కట్టేసిందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణం చేశాక మాట్లాడుతూ ‘మోదీ, షాల అశ్వమేధ గుర్రాన్ని కట్టేయడమే నా లక్ష్యమని యూపీ ఎన్నికల తర్వాత చెప్పా. కాంగ్రెస్‌ సాయంతో ఈరోజు కర్ణాటకలో నేను ఆ పని చేయగలిగా’ అని అన్నారు. సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామనీ, అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున అందుకు కొంత సమయం పడుతుందన్నారు. 

రైతులు ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడకుండా మనోనిబ్బరంతో ఉండాలనీ, రైతుల బిడ్డగా, సేవకుడిగా వారి బాధను అర్థం చేసుకుంటానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఏదైనా చేయాలంటే భాగస్వామ్య పక్షం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామ ని అన్నారు. బీజేపీకి అధికారం దక్కనివ్వకూడదన్న లక్ష్యంతోనూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో జతకలిసినట్లు కుమారస్వామి వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు