60 రోజులు కష్టపడితే అధికారం మనదే

24 Sep, 2018 01:59 IST|Sakshi
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

కార్యకర్తలకు ఉత్తమ్‌ దిశానిర్దేశం

ఫేస్‌బుక్‌ లైవ్, టెలి కాన్ఫరెన్స్‌లో 3 గంటల ప్రసంగం

ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

ఓటర్ల జాబితాలు, ఈవీఎంల పనితీరును పరిశీలించండి

అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, లక్ష ఉద్యోగాలు..

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే రెండు నెలలు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత కీలక సమయమని, ఈ 60 రోజుల పాటు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో అధికారం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని.. వచ్చే ప్రభుత్వంలో వారిని తగిన విధంగా గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఫేస్‌బుక్‌ లైవ్, టెలి కాన్ఫరెన్స్‌లో దాదాపు లక్ష మందితో 3 గంటల పాటు ఆయన ప్రసంగించారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, వారి కష్టంతోనే కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదిగిందని ఉత్తమ్‌ అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, తనకున్న సమాచారం మేరకు అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్‌.. నవంబర్‌ చివర్లో ఎన్నికలు వస్తాయని చెప్పారు. డిసెంబర్‌లో ఏర్పడబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25 ఓటర్ల జాబితా నమోదుకు, మార్పులు, పరిశీలనకు చివరి తేదీ కాబట్టి ప్రతీ కార్యకర్త ఓటర్‌ జాబితాను పరిశీలించాలని, పేర్లు లేని వారు కచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే 26 నుంచి ఈవీఎంల పరిశీలన కూడా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలను పరిశీలించి ఎలాంటి అనుమానాలున్నా, అక్కడే నివృత్తి చేసుకోవాలని సూచించారు.  

త్యాగాలు వారివి.. భోగాలు వీరివి 
యువకులు, సబ్బండ వర్ణాల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఒక్క కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగు పడిందని ఉత్తమ్‌ ఆరోపించారు. యువకులు త్యాగాలు చేస్తే కేసీఆర్‌ కుటుంబం భోగాలు అనుభవించిందని వ్యాఖ్యానించారు. విలాసవంతంగా నిర్మించిన ప్రగతిభవన్‌కే పరిమితమైన కేసీఆర్‌.. సచివాలయానికి రాకుండా రెండేళ్ల పాటు గడీలోనే పాలన సాగించారని విమర్శించారు. డబుల్‌ బెడ్రూం, దళితులు, గిరిజనులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, వివిధ వర్గాలకు రిజర్వేషన్లు లాంటి అనేక హామీల్లో కేసీఆర్‌ ఏ ఒక్క దానిని నెరవేర్చలేదని ఆరోపించారు. ఇంటింటికీ మంచి నీరు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్‌ 8 నెలల ముందే పాలన చేతగాక తప్పుకున్నారని దుయ్యబట్టారు.
 
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి.. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఉత్తమ్‌ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని హామీనిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర, యువకులకు లక్ష ఉద్యోగాలు మొదటి ఏడాదిలో కల్పిస్తామని చెప్పారు. అలాగే 10 లక్షల మంది యువకులకు నిరుద్యోగ భృతి, పేదలకు ఉచిత సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర వస్తువులు, 6 వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల నగదును రెట్టింపు చేస్తామని, 7 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహిస్తామని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఉత్తమ్‌ భరోసానిచ్చారు.  

మరిన్ని వార్తలు