బీజేపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయాం

1 Apr, 2018 02:04 IST|Sakshi
లేపాక్షి ఉత్సవాల్లో కళాకారులను అభినందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

లేపాక్షి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 

అనంతపురం: బీజేపీతో పొత్తు పెట్టుకుని చాలా నష్టపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన లేపాక్షి పట్టణంలో జరిగిన ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఆ రోజు ఇంకా 15 సీట్ల దాకా గెలుచుకునే వాళ్లమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. చివరి బడ్జెట్‌లోనూ మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని నిర్ణయించుకునే కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నానని అన్నారు. నిలదీస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి భయంగా ఉందన్నారు. కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇందుకు ప్రజల సహకారం కావాలని కోరారు.

ఈ విషయంలో కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రం సహకరిం చినా, సహకరించకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని వ్యాఖ్యానించారు. గట్టిగా అడిగితే కేంద్రం తనపై ఎదురుదాడి చేస్తోందని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా ఒక్క మాట మాట్లాడని జనసేన అధ్యక్షుడు ఈ రోజు యూటర్న్‌ తీసుకుని తనను విమర్శిస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రమఖులు కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, రాళ్లపల్లి తదితరులను సన్మానించారు. ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఈ ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు