ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం: మంత్రి అనిల్‌ కుమార్‌

12 Jun, 2019 11:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను హుందాగా నడిపిస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..సభలో ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని, సమావేశాలను హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళతామని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రానికి మంచి నాయకుడు వచ్చాడని ప్రజలకు సంకేతాలు ఇచ్చారని, ఏది చెబుతామో ...అది చేసి తీరాలన్న విధంగా వైఎస్‌ జగన్‌ ముందుకు వెళుతున్నారన్నారు. మంత్రులకు కూడా ఎవరైనా తప్పు చేస్తే... వారిని పక్కన పెడతామంటూ ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. తాము నిజాయితీగా ...పనిచేస్తే.. తమ కింద వాళ్లు కూడా అదేవిధంగా పనిచేస్తారన్నారు. తన పాలనతో దేశమంతా వైఎస్‌ జగన్‌ను అనుసరించే విధంగా చూపిస్తారని మంత్రి అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ కూడా అదే స్ఫూర‍్తితో: శ్రీకాంత్‌ రెడ్డి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన తీరు ఏవిధంగా ఉందో.. అసెంబ్లీ కూడా అదే స్ఫూర్తితో కొనసాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందనీ.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షం చెప్పినట్లు ఆడుతూ.. స్పీకర్ పదవికే కోడెల మచ్చ తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశాలు ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగానికే పరిమితమౌతుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలో జరిగే మరో సమావేశాల్లో పారదర్శకతే అజెండాగా ఉంటుందన్నారు.

మా అందరికీ గర్వంగా ఉంది: రోజా
దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, నవరత్నాలను అర్హులందరికీ అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసినట్లు మహిళలను టార్గెట్‌ చేయడం ఉండదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడకుండా గొంతునొక్కారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రతి శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను సభలో చర్చించేలా అవకాశం ఉంటుందన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటీ ప్రజలు కోరుకున్నదే అని అన్నారు. సామన్య ప్రజలు కూడా ప్రతిదీ తెలుసుకునేలా వైఎస్‌ జగన్‌ పారదర్శక పాలన అందించడం తమకు గర్వంగా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు