దేశాన్ని..రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

26 Jan, 2020 04:36 IST|Sakshi

మజ్లిస్‌ బహిరంగ సభలో వక్తలు

చార్మినార్‌/దూద్‌బౌలి: ‘‘దేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి..ఇదే ప్రస్తుతం మన ముందున్న ప్రధాన కర్తవ్యం.. ఇళ్లకే పరిమితం కాకుండా రోడ్లపైకి రావాలి. మనం తెలిపే వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి’’అంటూ పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. మజ్లిస్‌ పార్టీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీ ఖిల్వత్‌ మైదానంలో ‘జస్నే జమూరియత్, ఎతాజాజీ ముషాయిరా’అనే పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో పలువురు కవులు, కళాకారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని తమ వ్యతిరేకతను చాటి చెప్పారు. హైకోర్టు షరతులతో కూడిన అనుమతివ్వడంతో నిర్దేశిత సమయంలోనే సభను ముగించారు.

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవెసీ మాట్లాడకుండానే సభ ముగిసిం ది. అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు అస్మా జాహేరా, ఇమారత్‌ మిలియా సరయా అధ్యక్షు డు జాఫర్‌ పాషా తదితరులతో పాటు  సభలో ప్రముఖ కవులు మంజర్‌ బోపాలీ, రహాత్‌ ఇందోర్, హుస్సేనీ హైదరీ, అఫ్జల్‌ మంగ్లూరీ, ఇఖ్రాఖాన్‌ తదితరులు ఆలపించిన ముషాయిరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హైకోర్టు షరతులతో కూడిన ఉత్తర్వుల మేరకు శనివారం రాత్రి సభ సకాలంలో ముగిసిందని గ్రేటర్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు టి.ఉమామహేంద్ర అన్నారు. 

మరిన్ని వార్తలు