కాంగ్రెస్‌లోకి వారి చేరికను స్వాగతిస్తాం..

17 Oct, 2017 20:45 IST|Sakshi

పార్టీకి కొత్త రక్తం వస్తే తప్పులేదన్న షబ్బీర్‌ అలీ

టీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలపై సీఎం మౌనం సిగ్గుచేటని విమర్శ

సాక్షి, నిజామాబాద్‌ : టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంలు కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలోనే ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి కొత్త రక్తం వస్తే తప్పులేదని, వచ్చేవారిని స్వాగతిస్తామని అన్నారు. అయితే, ఎవరు కాంగ్రెస్‌లో చేరాలన్నా హైకమాండ్‌ ఆదేశానుసారంగా జరుగుతుందని, కోదండరాం వస్తానంటే అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అవినీతి ఆరోపణలపై సీఎం నోరువిప్పరా? : ‘‘అధికార పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా స్పీకర్‌ మధుసూదనాచారి, ఇంకొందరు ఎమ్మెల్యేలలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరి అవినీతి చేస్తే చెప్పుతో కొట్టండని జనానికి పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?’’ అని షబ్బీర్‌ ప్రశ్నించారు.

గాడి తప్పిన పాలన : మిషన్ భగిరథ పథకంలో బాగంగా ఇంటింటికి నీళ్లు ఎప్పుడు ఇస్తారనేదానిపై సంబంధిత అదికారులకే స్పష్టత లేదని, అన్ని జిల్లాలోనూ పరిపాలన గాడి తప్పిందని షబ్బీర్‌ అన్నారు. 
సోంత పార్టీ నేతలే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

గుజరాత్‌లోనూ గుర్‌దాస్‌పూర్‌ ఫలితమే : మరికొద్ది రోజుల్లో జరుగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తప్పదని షబ్బీర్‌ అలీ అన్నారు. నాందేడ్ కార్పోరేషన్, గురుదాస్ పూర్, కేరళ ఉప ఏన్నికల్లో వచ్చిన ఫలితాలే గుజరాత్‌లోనూ పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు