కేంద్రానికి షాకిచ్చిన నితీష్ కుమార్‌

20 Dec, 2019 16:26 IST|Sakshi

పట్నా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వం సవరణ చట్టం, ఎన్‌ఆర్సీపై నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివాదాస్పద చట్టాన్ని తమ రాష్ట్రాలలో అమలు చేయకూడదంటూ పౌరులు రాష్ట్ర ప్రభుత్వాలపై డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్‌ ఇచ్చారు. ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్‌ఆర్సీని బిహార్‌లో అమలు చేయాల్సిన అవసరం ఏముందని నితీష్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. నితీష్‌ వ్యాఖ్యలతో కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. వారి సరసన తాజాగా నితీష్‌ సైతం చేరారు.

 సీఏఏకు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ నితీష్‌ నేతృత్వంలోని జేడీయూ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే నితీష్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా గడిచిన వారం రోజుల నుంచి ఆందోళనలతో రాష్ట్రం రావణకాష్టంగా మారింది. చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, వామపక్షాల నిరసనలతో రాష్ట్రం అట్టడుకుతోంది. వేలమంది పౌరులు రోడ్లమీదకు వచ్చి చట్టానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్సీని, పౌరసత్వ ఈ నేపథ్యంలో ప్రజల ఆగ్రహానికి తలవంచిన నితీష్‌.. తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పట్నాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నితీష్‌ ప్రకటన చేశారు. కాగా రాష్ట్రంలోని ముస్లింలు ఎవరూ కూడా అధైర్య పడొద్దంటూ గురువారమే సీఎం భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు