రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల

10 Mar, 2019 08:19 IST|Sakshi

స్టాలిన్‌ వెల్లడి

నేడు కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

పోటీకి నటి కుష్బూ పట్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి నుంచి డీఎంకే అభ్యర్థుల జాబితాను రెండురోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు స్టాలిన్‌ ప్రకటించారు. డీఎంకే కూటమికి మొత్తం 14 పార్టీలు మద్దతు ప్రకటించగా ఆయా పార్టీల నేతలతో చెన్నై అన్నాఅరివాలయంలో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల పనులు, ప్రత్యర్థికూటమిని ఎదుర్కొనే వ్యూహం అంశాలపై చర్చించారు. అనంతరం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలో ఇప్పటికీ 14 పార్టీలు చేరగా మరికొన్ని పార్టీలు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆయా పార్టీల నేతలు ఎన్నికలపై అనేక సూచనలు చేశారని, తాము సైతం ఆయా సూచనలను స్వీకరించామని అన్నారు.

డీఎంకే పోటీచేసే స్థానాలపై రెండురోజుల్లో స్పష్టత వస్తుంది, సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్‌ పార్టీతో శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం అవుతున్నాం. కొత్తపార్టీలు వస్తే కూటమిలో చేర్చుకుంటాం, అయితే సీట్ల కేటాయింపును మాత్రం తామే నిర్ణయిస్తాం. కొత్తవారికి అవకాశం ఇస్తారా అనే ప్రశ్నకు జాబితా విడుదలనైపుడు మీరే చూస్తారుగా అని సమా«ధానం ఇచ్చారు. డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడం గురించి ప్రశ్నించగా, ఆ పార్టీపై ప్రశ్నలు వేసి సమయాన్ని వృథాచేసుకోవడం ఇష్టం లేదు, మీరు సైతం వృథా చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలతోపాటూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అయితే ఉప ఎన్నికలు రాకుండా అధికారపక్షం అడ్డుకుంటోందని స్టాలిన్‌ ఆరోపించారు. 

పోటీకీ కుష్బూ తహతహ:
కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న నటి కుష్బూ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. డీఎంకే–కాంగ్రెస్‌ కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి తొమ్మిదిస్థానాల కేటాయింపు జరిగింది. పోటీకి కాంగ్రెస్‌ కోరుతున్న స్థానాల జాబితా సిద్ధమైంది. అభ్యర్థుల జాతి, మతం, ఆర్థిక, అంగబలం బేరీజువేసుకుని రాహుల్‌గాంధీకి జాబితాను అందజేశారు. రాహుల్‌గాంధీ సైతం రాష్ట్ర నేతలతో చర్చించి తుదినిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాతో కాంగ్రెస్‌ బృందం డీఎంకేతో శనివారం సమావేశం కానుంది. రెండు స్థానాల్లో మినహా దాదాపుగా అన్నిస్థానాల్లో అభ్యర్థులను ఖరారుచేసుకున్నట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. అన్నిస్థానాల్లో గెలుపొందేలా అభ్యర్థుల ఎంపిక చేయాలని అధిష్టానం తెలిపిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా నటి కుష్బూ ఈ ఎన్నికల్లో పోటీచేయడం దాదాపు ఖరారైందని, దక్షిణ చెన్నై నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

అయితే చెన్నైలోని మూడు నియోజకవర్గాల్లో డీఎంకే పోటీచేయాలని నిర్ణయించుకుందని అన్నారు. ఈ కారణంగా చెన్నై పరిధిలో కుష్బూకు సీటు కేటాయింపు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. దక్షిణ చెన్నై వీలుకాని పక్షంలో తిరుచ్చిరాపల్లి నుంచి ఆమెకు అవకాశం కల్పించే ఆలోచన ఉందన్నారు. కుష్బూ అభిమానులు గతంలో తిరుచ్చిలోనే ఆలయాన్ని నిర్మించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కుష్బూ సైతం తిరుచ్చిలో పోటీకి సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే తిరుచ్చి సీటును టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ కోరుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన రామనాథపురాన్ని ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌కు కేటాయించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు జరిగి పోయిన నేపథ్యంలో కుష్బూకు సీటుపై మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం నాటి సమావేశంలో కుష్బూ సీటు ఖరారయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు