‘బీజేపీకి తప్ప ఎవరికైనా మద్దతిస్తాం’

10 May, 2019 15:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా నేతృత్వంలోని మతతత్వ బీజేపీకి తప్ప మరే పార్టీకైనా కేంద్రంలో మద్దతు తెలుపుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అదికూడా ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్న పార్టీకి మాత్రమే ఇస్తామని అన్నారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తామనేది ఫలితాల అనంతరమే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేజ్రీవాల్‌ వెల్లడించారు. తూర్పు ఢిల్లీ ఆప్‌ అభ్యర్థి ఆతిషిపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారాన్ని కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఉన్నత విద్యానభ్యసించిన ఓ మహిళ పట్ల బీజేపీ అలా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు.

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌.. గత ఎన్నికల సమయంలో ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆప్‌ కలిసి పోటీచేయాలని చివరివరకూ ప్రయత్నాలు జరిపిన విషయం తెలిసిందే. నేతల మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఇరు పార్టీలు విడివిడిగానే ఎన్నికల బరిలో నిలిచాయి. దీంతో దేశ రాజధానిలో త్రిముఖ పోటీ నెలకొంది.

మరిన్ని వార్తలు