'మేం ఏ పార్టీ కాదు.. వైఎస్‌ జగన్‌కు మద్దతిస్తున్నాం'

10 Oct, 2017 11:53 IST|Sakshi

సాక్షి, అనంతపురం : తాము ఏపార్టీకి చెందిన వాళ్లం కాదని ప్రొఫెసర్‌ జమీల్‌ పాషా అన్నారు. ఏ పార్టీకో మద్దతివ్వాలనే ఉద్దేశంతో తాము ఇక్కడికి రాలేదని, ప్రత్యేక కేటగిరి హోదా కోసమే ఇక్కడి వచ్చామని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరి హోదాను సాధించే బాధ్యతను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భుజాలకు ఎత్తుకున్నారని, అందుకే ఆయనకు మద్దతుగా వచ్చామని చెప్పారు. మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఏపీకి ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు, మేథావులతో 'యువభేరి' సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తన వంతు గొంతును వినిపించేందుకు వచ్చిన ప్రొఫెసర్‌ జమీల్‌ పాషా మాట్లాడుతూ..

'మేం ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఇక్కడికి వచ్చాము. ప్రత్యేక హోదా వేరు. ప్రత్యేక కేటగిరి హోదా రాష్ట్రాలు వేరు. దేశంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అది జమ్ముకశ్మీర్‌. ఇక ప్రత్యేక కేటగిరి హోదా ఉన్న రాష్ట్రాలు 11 ఉన్నాయి. ఏపీకి ఆ హోదా వస్తే మనది 12వ రాష్ట్రం అవుతుంది. అయినా ఇప్పటికీ చాలామంది ప్రత్యేక కేటగిరి హోదాపై అవగాహన లేకపోవడం బాధాకరం. అందుకే ప్రత్యేక కేటగిరి హోదాను తెప్పించే బాధ్యత భుజానికెత్తుకున్న వైఎస్‌ జగన్‌కు మేం మద్దతిస్తున్నాం. హోదా వస్తే నిరుద్యోగులకే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎంతో లాభం ఉంటుంది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తాయి. వలసలు ఆగిపోతాయి. యువత ఈ విషయంలో ముందుండి పోరాడాలి' అని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు