ఢిల్లీని మరో సిరియా కానివ్వం: బీజేపీ నేత

30 Jan, 2020 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రచారంలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. అల్లర్లను సృష్టించడానికి మహిళలు, పిల్లలను ఉపయోగించే ఉగ్రవాద సంస్థ ఐసీస్‌ నమూనాను ఢిల్లీలోని కొందరు అమలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీని మరో సిరియా కానివ్వమని తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు.

సీఏఏ నిరసనకారులు ఢిల్లీలోని రహదారులను దిగ్భందం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తరుణ్‌ చగ్‌ మండిపడ్డారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం ప్రధాన పాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించిందని, సర్వేలో బీజేపీ విజయం సాధిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కొందరు బీజేపీ నేతుల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 11న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం తెలిసిందే.

చదవండి: బీజేపీలోకి సైనా.. జ్వాలకు చీవాట్లు

మరిన్ని వార్తలు