నాడు ‘గరీబీ హఠావో’ నేడు ‘న్యాయ్‌’!

2 Apr, 2019 19:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి అనంతరం ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల ముందుకు వచ్చేవారు. ‘గరీబీ హఠావో’ అంటూ ఆమె ఇచ్చిన నినాదం కూడా అలాంటిదే. ఆ నినాదం సూటిగా పేద ప్రజల గుండెలను తాకడంతో ఆమె విజయం సాధించారు. ఆ నినాదమే ఆమె అధికారానికి సోపానమైనదని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె మనవడు అయిన రాహుల్‌ గాంధీ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ‘న్యాయ్‌’ అనే సరికొత్త నగద భరోసా స్కీమ్‌తో ప్రజల ముందుకు వచ్చారు. నాటి ‘గరీబీ హఠావో’ నినాదంలా న్యాయ్‌ స్కీమ్‌ రాహుల్‌ గాంధీకి అధికారాన్ని కట్టబెడుతుందా, లేదా అన్నది కాలమే తేల్చాలి.

ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఆర్థిక నిపుణలతో సంప్రతింపులు జరిపి న్యాయ్‌ను అమలు చేయగలమనే పూర్తి విశ్వాసంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో దీన్ని చేర్చామని రాహుల్‌ గాంధీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్‌ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలను కట్టబెట్టినప్పుడు నేను పేదల కోసం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 72 వేల రూపాయలకు ఖర్చు పెట్టలేనా ? అంటూ కూడా రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏటా 72 వేల రూపాయలంటే ఏటా 3,60,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత పెద్ద మొత్తం డబ్బును ఎక్కడి నుంచి వస్తుందో ఎన్నికల ప్రణాళికలో రాహుల్‌ గాంధీ వివరించి ఉంటే బాగుండేది. పార్టీ తరఫున రాహుల్‌ గాంధీ దేశంలో పేదరికం పెరిగిపోతోందని, వారిని ఆదుకునేందుకే తానొచ్చినట్లు చెబుతున్నారు, మరి మోదీకి ముందు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పేదరికం నిర్మూలన కోసం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు?

తాము అధికారంలోకి వస్తే గతంలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని కూడా రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినంత మాత్రాన నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారం అవుతుందని అనుకోవడం అర్థరహితమే అవుతుంది. దేశవ్యాప్తంగా శీతలీకరణ గిడ్డంగులను పెంచడం, సరైన మార్కెట్‌ సౌకర్యాలను కల్పించడంతోపాటు రైతులకు సరైన గిట్టుబాటు ధర చెల్లించాలి, సకాలంలో రుణ సౌకర్యం కల్పించాలి. వీటి గురించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో సమగ్ర వివరణ లేకపోవడం విచారకరం. (చదవండి: ‘అంత డబ్బు’ రాహుల్‌ వల్ల అవుతుందా?)

మరిన్ని వార్తలు