‘మోదీ’ జీవితంపై వెబ్‌ సిరీస్‌

13 Mar, 2019 18:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై బాలీవుడ్‌లో తీస్తున్న బయోపిక్‌ చిత్రం ఓ పక్క పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఆయన జీవితంపై ‘వెబ్‌ సిరీస్‌’ను తీస్తున్నామని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎరోస్‌’ బుధవారం నాడు ప్రకటించింది. ఈ సిరీస్‌ను వచ్చే ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేయడం విశేషం. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయనే విషయం తెల్సిందే. 2012లో ‘ఓ మై గాడ్‌’, 2018లో ‘102 నాట్‌ అవుట్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉమేశ్‌ శుక్లానే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

తొలుత ఆరెస్సెస్‌లో చేరి 12వ ఏట రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి మోదీ జీవిత చరిత్రను పది భాగాలుగా తీస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రి అవడం, 2014లో ప్రధానమంత్రి అవడం లాంటి ముఖ్యమైన ఘట్టాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని, నరేంద్ర మోదీ పాత్రలో వివిధ దశల్లో ఫైజల్‌ ఖాన్, ఆశిష్‌ శర్మ, మహేశ్‌ ఠాకూర్‌లు నటిస్తున్నారు. ఈ పది భాగాల వెబ్‌ సిరీస్‌ను మిహిర్‌ భూటా, రాధికా ఆనంద్‌లు లిఖించారు. ఈ సిరీస్‌కు టైటిల్‌ను ‘మోదీ’ అనే ఖాయం చేశారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో ఓ బాలీవుడ్‌ చిత్రం నిర్మాణంలో ఉన్న విశయం తెల్సిందే. ఇందులో మోదీ పాత్రలో వివేక్‌ ఆనంద్‌ ఒబరాయ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రలో మనోజ్‌ జోషి, మోదీ తల్లి హీరాబెన్‌ పాత్రలో జరీనా వాహెబ్‌ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు