సంక్షేమం, అభివృద్ధే మా ఎన్నికల అజెండా! 

24 Feb, 2019 03:20 IST|Sakshi

నూరు శాతం అమలుచేసే వాగ్దానాలే ఇస్తాం 

అందులో నవరత్నాలను చేరుస్తాం 

వైఎస్‌ఆర్‌ పథకాల స్ఫూర్తిని కొనసాగిస్తాం 

జగన్‌ సూచనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తాం 

అందరికీ మేలు చేసేలా రూపొందిస్తాం 

26న విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ 

వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి :  ఎన్నికల మేనిఫెస్టో అంటే తప్పుడు వాగ్దానాలతో ఓట్లు దండుకోవడం కాదని.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఐదేళ్ల కాలంలో అమలుచేయడమే మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నూటికి నూరు శాతం అమలుచేసే వాగ్దానాలనే తమ పార్టీ చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26న విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుందనే అంశాలపై ఆ సమావేశంలో ప్రణాళికను విడుదల చేయనున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 31 మందితో కమిటీని ప్రకటించారని, తొలి సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనలో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ ప్రణాళికను రూపొందిస్తామన్నారు.

ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించాలన్న దానిపై తమ అధినేత నిర్ధిష్టమైన సూచనలు ఇచ్చారని, వాటి ప్రాతిపదికగా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. అలాగే, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను ఇందుకు స్ఫూర్తిగా తీసుకుంటామని ఉమ్మారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో వైఎస్సార్‌ సమతుల్యత పాటించారని వివరించారు. జలవనరుల అభివృద్ధి, వ్యవసాయం పండుగ, అన్ని వర్గాల సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు భవిష్యత్‌ తరాలకు కూడా ఉపయోగపడేలా ఆయన చేపట్టిన కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపర్చేలా చూడాలని జగన్‌ సూచించారన్నారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలు నూటికి నూరుపాళ్లు అమలుచేస్తామనే భరోసా ప్రజలకు ఇచ్చేలా ఉండాలని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారన్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన ‘నవరత్నాలు’ అమలుచేస్తామని.. వీటితో వివిధ వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయని ఉమ్మారెడ్డి చెప్పారు. అలాగే, ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపకల్పన ఉంటుందని చెబుతూ మేనిఫెస్టోలో పొందుపరిచే నవరత్నాలను వివరించారు. అవి.. 

- నిరుపేద విద్యార్థుల బతుకులు మార్చిన ఫీజు రీయిుంబర్స్‌మెంట్, వైఎస్సార్‌ హయాంలో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ, రైతుకు అండగా నిలబడే వైఎస్సార్‌ రైతు భరోసా అంశాలకు అందులో ప్రాధాన్యత ఇస్తామన్నారు.  
అలాగే, జలయజ్ఞం పథకం కింద రైతు సంక్షేమం కోసం వనరులన్నీ ఒడిసిపట్టి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని వివరించారు.  
గతంలో ప్రభుత్వాలు అమలుచేయలేని మద్యం నిషేధాన్ని దశల వారీగా నిషేధించేలా చూస్తామని.. మహిళల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని దీనిని ఒక ప్రధాన అంశంగా తీసుకొస్తామన్నారు. 
అమ్మ ఒడి కార్యక్రమం కింద పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివిస్తామన్నారు. 
అలాగే, నిరుపేద వృద్ధులకు ఒక భరోసా కల్పించేలా వైఎస్సార్‌ ఆసరా పథకం ఉంటుందన్నారు.  
పేదవారికి పక్కా ఇళ్లు ఉండాలి.. పూరి గుడిసె కనిపించకూడదు అనే నినాదంతో పేదలందరికీ ఇళ్లు అనే ప్రధాన అంశం తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టబోతున్నామని చెప్పారు. 
ఎప్పుడో ఇచ్చిన పెన్షన్లు కాకుండా, ఆ మొత్తాన్ని పెంచడం, పెన్షన్ల అర్హత వయస్సును తగ్గించడం, చేతి వృత్తుల వారికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపడతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే పథకం కూడా ఇందులో ఉంటుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు.

ప్రతి రూపాయికీ లెక్క చెబుతాం
ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించడంతోపాటు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతి పైసానూ దుబారా చేయకుండా.. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఖర్చుచేస్తామని ఆయన వివరించారు. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా తీసుకువెళ్తామని ఉమ్మారెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, మేనిఫెస్టో కమిటీ ఒకటి ప్రభుత్వంలోనూ ఏర్పాటుచేస్తామన్నారు. పరిపాలన ప్రజల కోసమేగానీ నాయకుల కోసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో మాదిరిగా జన్మభూమి కమిటీలు వేసి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయకూడదన్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు