నవరత్నాలతోనే సంక్షేమం సాధ్యం 

18 Sep, 2018 05:30 IST|Sakshi
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడులో నవరత్నాలను ప్రజలకు వివరిస్తున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమం

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు 

ప్రజల నుంచి విశేష స్పందన...  వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేసుకుంటామన్న ప్రజలు 

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం విజయవంతంగా సాగింది. 13 జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ నవరత్న పథకాల గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఈ పథకాలతో జరిగే మేలు గురించి ప్రజలకు తెలియజెప్పారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో వస్తే రాజన్న రాజ్యం తెస్తారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తారని నేతలు ప్రజలకు కూలంకషంగా వివరించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తమ జీవితాల బాగుకోసం వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటామని ఏకకంఠంతో నినదించారు.  

సాక్షి, నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి నవరత్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.

నవరత్న పథకాల గురించి, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే జరిగే మేళ్ల గురించి నేతలు ప్రజలకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదల అభివృద్ధి కోసం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది అవుతాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అంటూ పాదయాత్రలు జరిగాయి. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసినా తడుస్తూనే పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నిచోట్లా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు.  

కదంతొక్కిన పార్టీ నేతలు, కార్యకర్తలు 
గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు కదంతొక్కారు. సత్తెనపల్లిలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాలలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. తొలిరోజు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో  ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమానికి ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.

ప్రజలు స్పందిస్తూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ జగన్‌ని గెలిపించుకుని సీఎం చేస్తామన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌పై రాష్ట్ర ప్రజలు నమ్మకం చూపుతున్నారని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అన్నారు. కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించి నవరత్నాల గురించి ప్రజలకు తెలియజెప్పారు. అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొని నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.  

మరిన్ని వార్తలు