సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు

4 Mar, 2019 04:03 IST|Sakshi

రాయలసీమలో అభివృద్ధి అంతంతమాత్రమే

టీడీపీ పాలనలో కులజాఢ్యం పేరుకుపోయింది

హెరిటేజ్‌ డెయిరీ కోసం విజయ డెయిరీని చంపేశారు

చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్‌ కల్యాణ్‌  

చిత్తూరు కలెక్టరేట్‌: తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఆందలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో పార్టీ నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ  పాలనలో అభివృద్ధి కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైందని, మెజారిటీ ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. మైనారిటీలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. ప్రైవేటు పరిశ్రమల కోసం సహకార రంగంలో పనిచేస్తున్న విజయ డైరీ, షుగర్‌ ఫ్యాక్టరీలను నష్టాల పేరుతో మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో కులాలకు శ్మశాన వాటికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీడీపీ తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు. అధికారపార్టీ పాలనలో కులజాడ్యం ఎంతలా పేరుకుపోయిందో దీంతో అర్థమవుతోందన్నారు. 

జనసేన పార్టీకి ఓట్లు, సీట్లు కన్నా మార్పు ముఖ్యమన్నారు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తిస్తామని పవన్‌కల్యాణ్‌ అన్నారు. అనేక సమస్యలపై స్వచ్ఛంద సంస్థల పోరాటాలు చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలకు స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఆస్తులు కబ్జాకు గురవుతున్నా టీడీపీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం విజయ డెయిరీని చంపేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం చిత్తూరు విజయ డెయిరీని తెరిపించాలని రైతు సంఘం నాయకుడు వెంకటాచలంనాయుడు పవన్‌కల్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  

మరిన్ని వార్తలు