మమతా బెనర్జీ అసంతృప్తి..!!

24 May, 2018 09:18 IST|Sakshi
ట్రాఫిక్‌ ఆరెంజ్‌మెంట్స్‌ గురించి కర్ణాటక పోలీసు ముఖ్యాధికారి వద్ద తన అసహనాన్ని తెలుపుతున్న మమతా బెనర్జీ

బెంగుళూరు : కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి తరపున జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రతిపక్షాల కూటమిని చూస్తే 2019లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే సమరశంఖం పూరించారన్నట్లు ఉంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసిందే. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.

వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల మమతా బెనర్జీకి ఇబ్బంది తలెత్తిందని సమాచారం. ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేదిక వద్దకు చేరుకోవడానికి ఉన్న దారిలో కదలడానికి వీలు లేకుండా వాహనాలతో రోడ్డును మూసివేసారని, దాని వల్ల దీదీ వేదికను చేరుకునేందుకు కొద్దీ దూరం నడిచి వచ్చారని సమాచారం. దీదీ వేదిక మీదకు వస్తున్నప్పుడు ఆమె అసహనం ఉండటం కెమెరా కంటికి చిక్కింది. అంతేకాకుండా తనకు కలిగిన ఇబ్బంది గురించి కర్ణాటక డీజీపీ నీలమణి రాజు వద్ద కూడా మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం రెడ్‌ కార్పెట్‌ మీద నడుచుకుంటూ అతిథులు ఉన్న వేదిక వద్దకు చేరారు. అక్కడ మమతా బెనర్జీని మాజీ ప్రధాని, కుమార స్వామీ తండ్రి హేచ్‌డీ దేవగౌడ వేదిక మీదకు ఆహ్వానించారు.

అనంతరం అతిథులకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్న తర్వాత మిగతా ప్రముఖులతో మమతా ముచ్చటించారు. అలానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పాటు మరికొంత మంది ఆప్‌ పార్టీ నాయకులకు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు హజరు కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఈ విషయం గురించి ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ్‌ చదా ‘బెంగుళూరులో ఉన్నంత ట్రాఫిక్‌ దేశంలో మరెక్కడా ఉండదు. అందువల్లే మేము ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లాము’అని ట్విట్‌ చేశారు.

మరిన్ని వార్తలు