మమత X గవర్నర్‌

3 May, 2020 03:02 IST|Sakshi
జగ్దీప్‌ ధన్‌కర్,మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో గవర్నర్‌ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మమత మండిపడ్డారు. ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ప్రకటనలను, లోగోలను వాడరాదని గవర్నర్‌ను కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తూ గవర్నర్‌ ధన్‌కర్‌ గత వారం ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. వీటికి బదులిస్తూ సీఎం మమతా బెనర్జీ శనివారం గవర్నర్‌కు 14 పేజీల లేఖ రాశారు.

‘ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్‌ రాసిన లేఖ, అందులో వాడిన భాష, భావం, తీరు అనూహ్యం. నాపైన, మా మంత్రులు, అధికారులనుద్దేశించి మీరు వాడిన భాష ఏమాత్రం తగినది కాదు’అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ఆచరించకుండానే ఆయన రాజ్యాంగ విలువలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం మినహా గవర్నర్‌కు అధికారాలేవీ లేవన్నారు. సంక్షోభ సమయంలో అధికారం చెలాయించేందుకు ఆయన చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు