పశ్చిమలో తు'ఫ్యాన్'

10 Apr, 2019 09:15 IST|Sakshi

పంట రుణాల మాఫీ పేరుతో టోపీ పెట్టిన చంద్రబాబు పెద్దకొడుకు ఎలా అవుతాడంటున్న రైతులు

డ్వాక్రా రుణమాఫీ చేయకుండా అప్పుల ఊబిలోకి నెట్టిన వారిని అన్నగా ఆదరించేదెలా అంటున్న మహిళలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా మోసం చేసిన వారికి మద్దతు ఇచ్చేది లేదంటున్న విద్యార్థులు

రాజన్న రాజ్యం తెచ్చే జగనన్నకే ఓటేస్తామంటున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు

పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరుగులు తీస్తున్నాయంటూ రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రచార యావను చూస్తే నవ్వు వస్తోందంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తవ్వించిన పోలవరం కాలువలో గోదావరి నీటిని ఎత్తిపోసి.. పట్టిసీమ ప్రాజెక్ట్‌ అంటూరూ.వందల కోట్లు దోచుకున్నారని.. పోలవరం పేరుతో హడావుడి చేస్తూ కాంట్రాక్టర్ల నుంచి రూ.వేల కోట్లు దండుకుంటున్నారని చంద్రబాబుఅసలు గుట్టు విప్పారు. 2018 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నీళ్లిస్తామని చంద్రబాబు చెప్పారని.. నేటికీ పునాదుల దశ దాటకపోయినా రాష్ట్రంనలుమూలల నుంచి కార్యకర్తల్ని బస్సుల్లో తీసుకొచ్చి కొండల్ని, బండల్ని, భారీ యంత్రాలను చూపించి.. అవే పోలవరంపనులంటూ భ్రమింప చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎన్నికల వేళ పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్ల మనోగతాన్ని
తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం రోడ్‌ షో నిర్వహించగా.. చంద్రబాబు ఆడుతున్న నాటకాలను బట్టబయలు చేశారు.ఆయన పాలనలో అవినీతి, అరాచకాలు పెచ్చుమీరాయని.. తిమ్మిని బమ్మిని చేస్తూ ఓటర్లను ఏమారుస్తున్న వైనాలను వివరించారు.

ఐదేళ్లపాటు టీడీపీ సర్కార్‌ సాగించిన వంచన.. ఆ పార్టీ ప్రజాప్రతినిధుల దోపిడీ.. ఎమ్మెల్యే ముసుగేసుకున్న రౌడీమూకల దాష్టీకాలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. బలమైన రాజకీయ మార్పునకు నాంది పలుకుతామంటున్నారు. జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు.. 15 శాసనసభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి.. 600కుపైగా హామీలు ఇవ్వడం ద్వారా జిల్లాలో స్వీప్‌ చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దీంతో ఆ పార్టీపై పెద్దఎత్తున ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోంది. అప్పట్లో టీడీపీకి ప్రతక్ష్యంగా మద్దతు పలికి.. ఆపార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన యాక్టర్, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు డైరెక్టర్‌ చంద్రబాబు చెప్పినట్టు నటిస్తూ టీడీపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తుండటంపై జనం మండిపడుతున్నారు.

డైరెక్టర్, యాక్టర్‌లకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి.. ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దన్నుగా నిలబడటానికి ‘పశ్చిమ’ ఓటర్లు సిద్ధమవుతున్న తీరు ‘సాక్షి’ రోడ్‌ షోలో స్పష్టంగా కన్పించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ కావడం ఖాయమని అధిక శాతం ఓటర్లు స్పష్టం చేయడం గమనార్హం. ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాష్టీకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందని షేక నవాబ్‌ అనే వ్యాపారి వాపోయారు. నగర పాలక సంస్థ పరిధిలో చిన్నపాటి పనికైనా ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తున్నారని టీడీపీకే చెందిన కార్పొరేటర్‌ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. భూకబ్జాలు పెట్రేగిపోయాయని, ఐదేళ్లుగా దాష్టీకాలను భరిస్తూ వచ్చామని, పోలింగ్‌ రోజున ఓటు అనే ఆయుధంతో ప్రతీకారం తీర్చుకుంటామని పలువురు ఓటర్లు స్పష్టీకరించారు. టీడీపీపై అన్నివర్గాల ప్రజలల్లోనూ అసహనం వ్యక్తమవుతుండటం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై సానుకూలత వ్యక్తమవుతుండటంతో ఏలూరు నియోజకవర్గంలో వార్‌ వన్‌సైడ్‌గా కనిపిస్తోంది.  

దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మమ్మల్ని తూలనాడిన చింతమనేనికి.. తమ వర్గాల దెబ్బేంటో చూపిస్తామని ఆ వర్గాలకు చెందిన ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇసుక దోపిడీకి అడ్డుపడిన తహసీల్దార్‌ వనజాక్షినే కాదు, అనేక మంది మహిళలపై చింతమనేని దాడులకు తెగబడ్డారని.. అలాంటి దుశ్సాసనుడికి బుద్ధి చెబుతామని మహిళలు అంటున్నారు. ‘పోలవరం కుడి కాలువలో 1.45 ఎకరాల భూమిని సర్కార్‌ సేకరించింది. ఎకరానికి రూ.22 లక్షలే వస్తుందని.. తాను రూ.44.90 లక్షలు ఇప్పించానని.. ఇందుకు ప్రతిఫలంగా రూ.22 లక్షలు లంచంగా ఇవ్వాలంటూ చింతమనేని లాక్కున్నారు. నా పొలంలో పోలవరం కుడి కాలువ తవ్వకంలో తీసిన మట్టిని చింతమనేని దొంగలించి.. ఒక లారీ మట్టిని రూ.3 వేల చొప్పున నాకే అమ్మాడు. ఇలాంటి దోపిడీదారుడిని సాగనంపుతాం’ అని పెదవేగి మండలం ఏపూరుకు చెందిన ఒక రైతు చెప్పారు. వీటిని బట్టి చూస్తే దెందులూరులో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నది తేలిపోయింది. డైరెక్టర్‌ చంద్రబాబు చెప్పినట్టు నటిస్తున్న యాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌కు భీమవరంలో ఎదురుగాలి వీస్తోంది.

కొవ్వూరు, గోపాలపురం, ఉంగుటూరు, పోలవరం, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ గాలి బలంగా వీస్తోంది. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, చింతలపూడి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. నరసాపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ, జనసేన లాలూచీ పడి అభ్యర్థులను బరిలోకి దించారు. ఈ క్రమంలోనే యాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌ తన సోదరుడు నాగబాబును జనసేన అభ్యర్థిగా పోటీకి నిలిపారు. టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యే శివరామరాజును టీడీపీ పోటీకి దించి.. డమ్మీని చేసింది. టీడీపీ, జనసేన మధ్య లాలూచీ బయటపడటం, నాగబాబు వ్యవహార శైలి జీర్ణించుకోలేని రీతిలో ఉండటం.. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజుకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలు ఉండటంతో.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార సభలకు జన స్పందన భారీగా లభించటంతో నరసాపురం లోక్‌సభ స్థానం వైఎస్సార్‌ సీపీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో చోటుచేసుకున్న అరాచకాలను, అకృత్యాలను, మోసపూరిత విధానాలను ఏకరువు పెట్టిన ప్రజలు టీడీపీ సర్కారు పాలనకు చరమగీతం పాడతామని ముక్తకంఠంతో చెప్పారు. – రామ్‌గోపాల్‌రెడ్డి, సాక్షి, అమరావతి

చంద్రబాబు ధృతరాష్ట్రుణ్ణి మించిపోయారు
మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపిస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను దండించాల్సిన చంద్రబాబు అతగాడిని ప్రశంసించి ధృతరాష్ట్రుడిని మించిపోయారు. అకృత్యాలకు పాల్పడిన ధృతరాష్ట్రుడు, కౌరవులకు ఆనాడు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, చింతమనేనికి తగిన శాస్తి చేస్తాం. రాజన్న రాజ్యం తెచ్చే జగనన్నకే అండగా నిలుస్తాం.– ప్రమీల, చల్ల చింతలపూడి, దెందులూరు నియోజకవర్గం

ఇసుక కావాలంటే సొమ్ములివ్వాలి
పక్కనే గోదావరి. ఇళ్లు కట్టుకోవాలంటే గోదాట్లోకి ట్రాక్టర్‌ వేసుకెళ్లి ఇసుక తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నుంచి ట్రాక్టర్‌ ఇసుకను రూ.1,500కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా దోచుకున్న సొమ్ములో 50 శాతం వాటాను చంద్రబాబుకు ఇస్తారని శేషారావు అనుచరులే చెబుతున్నారు. అటు గోదారిని తవ్వేసి.. ఇటు మమ్మల్ని దోచేసిన టీడీపీకి ఎందుకు ఓటేయాలి.– తోట సుబ్బారావు, వేలివెన్ను, నిడదవోలు నియోజకవర్గం

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు
పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 నాటికే పూర్తిచేసి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ల నుంచి సీఎం చంద్రబాబు భారీగా కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడొచ్చి.. మళ్లీ అధికారమిస్తే పోలవరం పూర్తి చేస్తానంటున్న చంద్రబాబును ఎలా నమ్ముతాం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరంను పూర్తిచేసే సత్తా జగన్‌కే ఉంది. నా ఓటు జగన్‌కే.
– అడపా వెంకటరత్నం, భీమడోలు, ఉంగుటూరు నియోజకవర్గం

వడ్డీల ఊబిలో ముంచేశారు
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటే నమ్మాం. మా గ్రూపు తరఫున బ్యాంకులో తీసుకున్న రూ.5 లక్షలు కట్టకుండా మానేశాం. చంద్రబాబు చేసిన మోసానికి మాపై రూ.1.50 లక్షల వడ్డీ భారం పడింది. మా గ్రూపులో ఒక్కొక్కరిపై రూ.15 వేల భారం వడ్డీ రూపంలో పడింది. రుణం రూపంలో రూ.50 వేలు కలిపి మొత్తం రూ.65 వేలు చంద్రబాబు నాకు బాకీ పడ్డారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ కింద రూ.10 వేలు ఇస్తానంటే ఎలా నమ్ముతాం. ముంచేసిన వాడు అన్న ఎలా అవుతాడు?– మద్దినేని సరస్వతి, సజ్జాపురం, తణుకు నియోజకవర్గం

రైతులను నిలువునా ముంచారు
2014 ఎన్నికల్లో పంట రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాకు బ్యాంకులో రూ.1.65 లక్షల అప్పు ఉంది. ఇప్పటిదాకా రూ.16 వేలు రుణ మాఫీ కింద ఇచ్చారు. వడ్డీ రూ.85 వేలు అయ్యింది. రుణమాఫీ పేరుతో రైతులందరికీ టోపీ పెట్టిన చంద్రబాబును నమ్మం. మహానేత రాజశేఖరరెడ్డిలా రైతులకు అండగా నిలబడేది జగన్‌ ఒక్కరే.– సూర్యప్రకాశరావు, తెలికిచర్ల, గోపాలపురం నియోజకవర్గం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికీ ఇవ్వలేదు
నేను బీటెక్‌ (మెకానికల్‌) సెకండ్‌ ఇయర్‌ చదవుతున్నా. ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతుంటే.. మాకున్న అర ఎకరం పొలం అమ్మి నాన్న ఫీజు కట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సక్రమంగా విడుదల చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మీ భవిష్యత్‌ నా బాధ్యత అని చెబుతున్న చంద్రబాబును ఎలా నమ్ముతాం? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా ఇచ్చే జగన్‌కే నా ఓటు.– బి.నరేంద్ర యాదవ్, శనివారపుపేట, ఏలూరు 

మరిన్ని వార్తలు