కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ఏమైంది? 

1 Oct, 2018 03:48 IST|Sakshi
‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో అభివాదం చేస్తున్న ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌సింగ్, కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ తదితరులు

  ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ ప్రశ్న 

  మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చి ఊసేలేకుండా పోయిందని ధ్వజం 

  పాలమూరులో టీజేఎస్‌ ప్రజాగర్జన మరో పోరాటానికి పిలుపు

 పాలమూరుకు కేసీఆర్‌ దగా చేశారని విమర్శించిన కోదండరాం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తానన్న థర్డ్‌ ఫ్రంట్‌ ఏమైందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్జీ (ఆర్‌ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తామని, 2 నెలల పాటు దేశం లోని పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలసి చివరకు దాని ఊసేలేకుండా పోయిందని ఎద్దేశా చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించి తర్వాత ఫ్రంట్‌ ప్రస్తావనే లేకుండా పోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) నిర్వహించిన ‘పాలమూరు ప్రజాగర్జన’సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ కోసం 1,200 మంది యువత బలిదానం చేసుకున్నారని, ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష కోసమే పార్లమెంటులో బిల్లు సందర్భంగా మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని, తెలంగాణ బిడ్డలు దోపిడీకి గురయ్యార న్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండో దశ పోరాటం కోదండరాం నేతృత్వంలో పాలమూరు నుంచే ప్రారంభం కావాలన్నారు.

‘పాలమూరును దగా చేశారు’ 
పాలమూరు ప్రాంతాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగా చేశారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లాడని ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కు పూర్తి మద్దతిచ్చి ఎంపీగా గెలిపించారని, తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తే వారిని దగా చేశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో మార్పుల వల్ల  రూ.5 వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదని, ఉపాధి లేక ముంబైకి వలస వెళ్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం పాజెక్టు నిర్వాసితులకు ఏపీలో ఉద్యోగాలిచ్చారని, జీవో నం.68, 90 ప్రకారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రశ్నిస్తే నిర్బంధాలు కొనసాగిస్తున్నారని, ధర్నాచౌక్‌లు బంద్‌ చేశార న్నారు. ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజల పూర్తి మద్దతు టీజేఎస్‌కు ఇవ్వాలని సామాజిక తెలంగా ణ రూపకల్పనకు కృషిచేస్తామని హామీనిచ్చారు. మహబూబ్‌నగర్‌ టీజేఎస్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్‌లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు