షహీన్‌బాగ్‌తో ఎవరికి చెక్‌

31 Jan, 2020 04:39 IST|Sakshi

ఢిల్లీ ఎన్నికల్లో జాతీయ భావం వెల్లువెత్తుతుందా?

కేజ్రీవాల్‌ సొంత ఎజెండా పనిచేస్తుందా?  

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీలోని యమునా నది ఒడ్డున షహీన్‌బాగ్‌ ప్రాంతం గత నెలరోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. వణికించే చలిని లెక్కచేయకుండా ముస్లిం వర్గానికి చెందిన వారు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంతో బీజేపీ షహీన్‌బాగ్‌ను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. సీఏఏ వ్యతిరేకుల్ని పదునైన మాటలతో ఎండగడుతోంది.

దేశభక్తి వర్సస్‌ టుక్డే టుక్డే గ్యాంగ్‌ ఎన్నికలుగా వీటిని అభివర్ణిస్తూ ఎవరివైపు ఉంటారని ప్రశ్నిస్తోంది. కేజ్రీవాల్‌ ఇప్పటివరకు షహీన్‌బాగ్‌కు ఎందుకు రాలేదంటూ ఆప్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలైన పర్వేష్‌ వర్మను మూడు రోజులు, అనురాగ్‌ ఠాకూర్‌ని నాలుగు రోజుల పాటు ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించినా కమలదళం తాను చేపట్టిన వ్యూహం ప్రకారమే ముందుకి అడుగులు వేస్తోంది.  

ఆచితూచి వ్యవహరిస్తున్న ఆప్‌
సీఏఏ అంశంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందూ ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న ఆందోళనలో ఉన్న కేజ్రీవాల్‌ దీనిపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. షహీన్‌బాగ్‌ వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపే ధైర్యం చేయలేదు. అయిదేళ్లలో తాను చేసిన పనులనే ప్రస్తావిస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచితంగా నీళ్లు, స్కూలు ఫీజుల నియంత్రణ, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వంటివే ప్రస్తావిస్తున్నారు. సుపరిపాలన అన్న సొంత ఎజెండాతోనే ముందుకు వెళుతున్నారు.  

పరువు కాపాడుకునే వ్యూహంలో కాంగ్రెస్‌  
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే. ఆప్‌ రాజకీయాల్లోకి వచ్చాక రాజధానిలో ఇంచుమించుగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఒక వర్గంలో నెలకొన్న సీఏఏ వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఢిల్లీలో 8 నుంచి 10 స్థానాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంది. కనీసం ఆ స్థానాలనైనా దక్కించుకొని పరువు కాపాడుకునే పనిలో ఉంది. షహీన్‌బాగ్‌ నిరసనకారుల్ని టుక్డే టుక్డే గ్యాంగ్‌ అంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కేంద్రానివే దేశాన్ని విభజించే టుక్డే టుక్డే రాజకీయాలంటూ ప్రచారం ప్రారంభించింది.  

బీజేపీ అస్త్రం పని చేస్తుందా ?
షహీన్‌బాగ్‌ బీజేపీ ట్రంప్‌ కార్డా లేదంటే, అసహనంతో కూడుకున్న అస్త్రమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ షహీన్‌బాగ్‌ ఆందోళనలపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్లే బీజేపీ జాతీయ భావాన్ని రగల్చడంలో ఎంతో కొంత పైచేయి సాధించిందని ఎన్నికల విశ్లేషకుడు ప్రదీప్‌ భండారీ అభిప్రాయంగా ఉంది. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎగువ మధ్యతరగతిలో సీఏఏపై పెద్దగా వ్యతిరేకత లేదు. మరోవైపు షహీన్‌బాగ్‌ నిరసనలతో ట్రాఫిక్‌ జామ్‌లు ఎక్కువై సామాన్యులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగని ఆమ్‌ ఆద్మీ పార్టీపై అధికార వ్యతిరేకత కూడా లేదు. అమిత్‌షా చాణక్య నీతిని కేజ్రీవాల్‌ ఎంతవరకు సమర్థవంతంగా తిప్పికొట్టగలరో అన్న దానిపైనే బీజేపీ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుందని
సీఎస్‌డీఎస్‌ రాజకీయ విశ్లేషకుడు సంజయ్‌ కుమార్‌ అభిప్రాయపడుతున్నారు.

ఫిబ్రవరి 8న మీరు ఈవీఎంల బటన్‌ ఎంత ఆగ్రహంతో ప్రెస్‌ చేయాలంటే దాని ప్రకంపనలు షహీన్‌బాగ్‌ను వణికించాలి.
– కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా   

షహీన్‌బాగ్‌లో నిరసనకారులు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు. మీ చెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేయొచ్చు. చివరికి మిమ్మల్ని చంపేయొచ్చు కూడా.
    –బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ  

టుక్డే టుక్డే గ్యాంగ్‌కి షహీన్‌బాగ్‌ కేంద్రంగా మారింది.
–కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  

దేశద్రోహుల్ని కాల్చి చంపండి.
–కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌  

>
మరిన్ని వార్తలు