‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు

20 Jul, 2018 15:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్‌సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది. ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్‌ సందర్భంగా ప్రభుత్వం ఓడిపోతే ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్‌ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన మంత్రే లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చు. సాధారణంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోతామని భావించిన సందర్భాల్లోనే ఓటింగ్‌కు కంటే ముందే ప్రధాని లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేస్తారు.

26 సార్లు అవిశ్వాస తీర్మానాలు
కేంద్ర ప్రభుత్వాలపై గతంలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 25 సార్లు అవి వీగిపోయాయి. ఒక్కసారి మాత్రం తీర్మానంపై ఓటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్‌ రాజీనామా చేశారు.

దేశంలో మొట్టమొదటి సారిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసం వచ్చింది. భారత్‌–చైనా యుద్ధానంతరం 1963లో ఆయన ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 285 ఓట్ల మార్జిన్‌తో నెహ్రూ సభా విశ్వాసాన్ని పొందారు. రాజీÐŒ గాంధీ, అటల్‌ బిహారీ వాజపేయి చెరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనగా, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ, పీవీ నర్సింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ  మొత్తం 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మురార్జీ దేశాయ్‌కి కూడా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదురుకాగా, ఒకసారి ఓటింగ్‌కన్నా ముందే (1979, జూలై 12) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చివరి సారి 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకొన్నది అటల్‌ బిహారి వాజపేయికాగా, 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకే అవిశ్వాసం ఎదురయింది.

విశ్వాస తీర్మానాల్లో..
దేశంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానాల సందర్భంగా ఐదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేయగా, ఏడుసార్లు మాత్రం ప్రధాన మంత్రులు సభా విశ్వాసాన్ని నిరూపించుకో గలిగారు. రెండు సార్లు ప్రధాన మంత్రులు విశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్‌ జరగక ముందే పదవులకు రాజీనామా చేశారు. 1979లో చరణ్‌ సింగ్‌ రాజీనామా చేయగా, 1996లో వాజపేయి రాజీనామా చేశారు. 1979, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చర్చకు రావల్సి ఉండగా ముందే చరణ్‌ సింగ్‌ రాజీనామా చేశారు. 1996, మే 27,28 తేదీల్లో వాజపేయి విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ ఓటింగ్‌ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు.

1989లో వీపీ సింగ్, 1990లో చంద్రశేఖర్, 1993లో పీవీ నర్సింహారావు, 1996లో హెచ్‌డీ దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో వాజపేయి, 2008లో మన్మోహన్‌ సింగ్‌లు సభా విశ్వాసాన్ని పొందారు. వీరిలో ముగ్గురు ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షల్లో వీగిపోయి వారి పదవులకు రాజీనామా చేశారు. 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజపేయిలు అలా రాజీనామా చేశారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్‌ సభా విశ్వాసాన్ని పొంది తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. వారి స్థానాల్లో పీవీ నర్సింహారావు, మన్మోహన్‌ సింగ్‌లు ప్రభుత్వాలకు సారథ్యం వహించారు.

మరిన్ని వార్తలు