ఆ పోలికేమిటో ఆయనకే తెలియాలి?

25 Jul, 2018 16:40 IST|Sakshi

మూక హత్యలకు 1984 నాటి సిక్కు అల్లర్లతో సంబంధమా?!

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న మూక హత్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం నాడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ మూక హత్యలు ఇప్పుడు కొత్తగా ప్రారంభం అయినవి కావని, 1984లోనే భారీ ఎత్తున మూక హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు గోరక్షకుల పేరిట నేడు ముస్లింలపై జరుగుతున్న మూక హత్యలకు పోలికేమిటో ఆయనకే తెలియాలి. బీజేపీ పాలిత రాష్ట్రంలోగానీ, బీజేపీ పాలిత కేంద్రంలోగానీ ఎలాంటి దారుణాలు జరిగినా 1984 నాటి అల్లర్లనే బీజేపీ నాయకులు ప్రస్థావిస్తారు.

2002లో గుజరాత్‌లో జరిగిన ముస్లింల ఊచకోతను సమర్థించుకోవడానికి 1984లో కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అల్లర్ల గురించే మాట్లాడారు. మళ్లీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకటి, అర తప్పించి గోరక్షణ దాడులు పెద్దగా లేవని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పెరిగాయని ‘ఇండియాస్పెండ్‌ (డేటా జర్నలిజం సంస్థ)’ సేకరించిన డేటానే తెలియజేస్తోంది. 2010 నుంచి 2017 వరకు గోరక్షణ పేరిట జరిగిన దాడుల్లో 97 శాతం దాడులు మోదీ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని, వాటిలో యాభై శాతం దాడులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని ఇండియాస్పెండ్‌ ఓ నివేదికలో పేర్కొంది. దాడుల్లో కూడా 90 శాతం దాడులు కేవలం గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానంపైనే జరిగాయి. పిల్లల కిడ్నాపర్లనుకొని ప్రస్తుతం మూక హత్యలు ఎలా జరుగుతున్నాయో అలాగే.

ఈ అమానుష దాడులను ఎలా అరికట్టాలో, అందుకు తీసుకోవల్సిన చర్యలేమిటో ఆలోచించకుండా ముస్లింలు గోమాంసం మానేసే వరకు ఇలాంటి దాడులు జరుగుతాయని ఓ రాజస్థాన్‌ మంత్రి వ్యాఖ్యానించడం, అవునంటూ ఆరెస్సెస్‌ నాయకులు ఆయన్ని సమర్థించడం ఏ మేరకు సబబు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కూడా ముస్లింలు గోమాంసం తింటున్నారుకదా, ఇన్నేళ్లు ఎందుకు జరగలేదు? జార్ఖండ్‌లో పశువుల వ్యాపారిని హత్య చేసిన కేసులో శిక్ష పడిన ఎనిమిది మంది దోషులకు లీగల్‌ ఫీజులు చెల్లించడమే కాకుండా వారు ఇటీవల బెయిల్‌పై విడుదలయితే ఇంటికి పిలిపించి వారిని కేంద్ర మంత్రి సత్కరించడం, జూన్‌ నెలలో మూక హత్య కేసులోనే నలుగురు నిందితులకు అవసరమైన లీగల్‌ ఫీజులను జార్ఖండ్‌కు చెందిన మరో బీజేపీ ఎంపీ చెల్లించడం లాంటి అంశాలు దాడులు ఎందుకు జరుగుతున్నాయో సూచిస్తున్నాయి.

మరిన్ని వార్తలు