అంతు చిక్కని రేవంత్‌ వ్యూహం.. సిటీకి లోకేశ్‌!

20 Oct, 2017 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారా? టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటే.. మరీ తెలంగాణ నేతల ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరైనట్టు.. ఇప్పుడు ఇదే అంశం టీడీపీ శ్రేణుల్లో, చంద్రబాబు వర్గం నేతల్లో అయోమయానికి తావిస్తోంది.

రేవంత్‌ వ్యవహారంపై చర్చించేందుకు బాస్‌ చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీపీ నేతలు శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రేవంత్‌ హాజరుకావడంతో బాబు అనుకూల వర్గం నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని సమాచారం. ఈ ప్రత్యేక భేటీ ప్రధాన అజెండా రేవంత్‌ పార్టీ మార్పు.. ఆయనే రావడంతో, ఇక ఏం చర్చించాలనే దానిపై వారు తర్జనభర్జన పడ్డారని తెలుస్తోంది. ఈ సమావేశానికి వచ్చిన వారిలో మెజారిటీ నేతలు రేవంత్‌ వ్యతిరేకులే ఉండటం గమనార్హం.

ఇక చంద్రబాబు అనుకూల నేతల తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనా.. పట్టించుకోకుండా తనను టార్గెట్ చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను జైల్లో పెట్టిన వ్యక్తి (కేసీఆర్‌)తో మీరు ఎలా అంటకాగుతారు? పార్టీ కోసం నేను పోరాడుతుంటే వాళ్లు (ఏపీ నేతలు) కాంట్రాక్టులు ఎలా తీసుకుంటారు? ఇలాగైతే పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది' అని రేవంత్‌ చంద్రబాబు అనుకూల వర్గం నేతలను నిలదీసినట్టు తెలుస్తోంది. అదేసమయంలో చంద్రబాబు అండ్‌ కో నేతలు కూడా రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగడం సరికాదని రేవంత్‌కు బాబు అనుకూల నేతలు హితవు పలికినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో లోకేశ్‌ మకాం
రేవంత్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీడీపీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌ హైదరాబాద్‌లో మకాం వేశారు. తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన ఆరా తీస్తున్నారు. మూడురోజులపాటు లోకేశ్‌ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. లోకేశ్‌ డైరెక్షన్‌లోనే చంద్రబాబు అనుకూల నేతలు రేవంత్‌ వ్యవహారంలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో రెండురోజుల క్రితం లోకేశ్‌ను టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కలిసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు