అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?

14 Sep, 2019 19:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను పార్టీ మారితే బాగుండని మా పార్టీ నేతలే కొందరు ఆనందపడ్డారు. నేను వేరే పార్టీలోకి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు. సెప్టెంబర్‌ 17న ఓ మైనార్టీ ఎమ్మెల్యేగా బీజేపీలో చేరతానని ఎలా అనుకుంటారని’ టీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు.

‘మా ఇంటి పక్కనే ఉండే నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి. నేను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా. ఎవరికీ భయడాల్సిన అవసరం నాకు లేదు. గోడమీద పిల్లిలా ఉండను’ అని షకీల్‌ కామెంట్‌ చేశారు. ‘నేను గతంలో బీజేపీ నిజామాబాద్‌ జిల్లా మైనార్టీ మోర్చాలో పనిచేశా. నా మీద కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో నా మీద ఉన్న రెండు కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకున్నా. నా మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’ అని షకీల్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు