ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ స్పృహ లేదు!

21 Nov, 2017 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలెన్ని.. ప్రభుత్వం ఇప్పటివరకు  ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ‘నిరుద్యోగ సమరభేరి’ పోస్టరును ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత ఆశపడిందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితి వచ్చిందని, మానవ వనరులను ఉపయోగించుకోవాలనే స్పృహ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కోర్టు వివాదాల్లో ఉన్నాయన్నారు.

రాష్ట్రం ఏర్పాటై మూడున్నరేళ్లు గడిచినా ఉద్యోగ సమస్య పరిష్కారం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 82వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించిందన్నారు. 2.74 వేలకోట్ల రుణాలను ముద్ర బ్యాంకు ద్వారా యువత ఉపాధికోసం ఇచ్చిందని, దీనివల్ల కోటిమందికి పైగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నదని దత్తాత్రేయ వివరించారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులపట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 26న బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమరభేరి పేరుతో సభను నిర్వహిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై, ఇప్పటిదాకా పూర్తిచేసిన నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు