హజారే దీక్ష వెనక అజ్ఞాత శక్తి ఎవరు?

24 Mar, 2018 18:34 IST|Sakshi
అన్నా హజారే (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అవినీతిని అరికట్టేందుకు, ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులను కూడా విచారించేందుకు జన్‌ లోక్‌పాల్‌ బిల్లును తీసుకరావాలంటూ అన్నా హజారే మరోసారి రామ్‌ లీలా మైదానంలో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఈ సారైనా విజయం సాధిస్తుందా ? ఫలితం సంగతి మాట పక్కనే పెడితే కనీసం ఆయన దీక్షకు అంతటి ప్రాచుర్యం లభిస్తుందా? నాటి దీక్ష అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వాన ఆప్‌ పార్టీ ఆవిర్భవించేందుకు దోహదం పడిందీ. ఇప్పుడు అలాంటి పార్టీ మరోటి పుట్టుకొస్తుందా ?

2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారా ప్రారంభించిన  దీక్షకు అంతటి ఆదరణ లభించడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా హోస్ని ముబారక్, కల్నల్‌ గడాఫీ లాంటి నియంతలను మట్టి కరిపించిన ‘అరబ్‌ వసంతం’ పేరిట మధ్యప్రాచ్యంలో ఉప్పెనలా ప్రజా ఉద్యమం కొనసాగుతున్న రోజులవి. దేశీయంగా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన రోజులు. అన్నా హజారే లాంటి ఉద్యమాలను 24 గంటలపాటు ప్రసారం చేయడానికి అవసరమైన ఫుటేజ్‌ కోసం టీవీలు కూడా వెతుక్కుంటున్న రోజులు. అన్నింటికన్నా అవినీతిని అంతమొందించాలన్న మొండి సంకల్పంతో అరవింద్‌ కేజ్రివాల్, ఆయన సహచరుడు మానిష్‌ సిసోడియా ముందుకొచ్చిన రోజులు.

నిజం చెప్పాలంటే నాడు ఆర్టీఐ కార్యకర్తగా మెగసెసె అవార్డు అందుకున్న అరవింద్‌ కేజ్రివాల్, అన్నా హజారే ఉద్యమానికి ఊపిరిలా నిలబడ్డారు. హజారేను రాందేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌, కిరణబేడీ, ప్రశాంత్‌ భూషణ్‌ను తన సహచరుడు సిసోడియా సహకారంతో  కలుసుకొని వారిని ఒక వేదికపైకి తీసుకొచ్చిందే కేజ్రివాల్‌. అప్పటికే మహారాష్ట్ర మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా పలుసార్లు నిరాహార దీక్షలు చేసిన అన్నా హజారే ముందుంటే బావుంటుందని భావించే కేజ్రివాల్‌ ఆయనకు ఆ తర్వాత పోరాటంలో సముచిత స్థానం కల్పించారు. 2011, జనవరి నెలలో మొదటిసారి అవినీతికి వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించినప్పుడు పలువురు వక్తల్లో అన్నా హజారే ఒకరు మాత్రమే.

అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా నడిపించినా ఫలితం లేకపోవడంతో అరవింద్‌ కేజ్రివాల్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పోరాడాలనుకున్నారు. ముందుగా అందుకు స్వాగతం పలికిన అన్నా హజారే ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ తప్పుకున్నారు. హిమాచల్‌ నుంచి పార్టీని ప్రారంభించాలనుకున్నప్పుడు అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసి రావాల్సిందిగా సిసోడియాను  అక్కడికి పంపించిందే హజారియా. చివరకు రాజకీయ పార్టీకి దూరంగా ఉండాలనుకోవడం ఆరెస్సెస్‌ ఒత్తిడే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెల్లార్లు రామ్‌లీలా మైదానంలో జనం ఉన్నా లేకున్నా పడిగాపులు కాసిన వారంతా ఎక్కువగా ఆరెస్సెస్‌ కార్యకర్తలే.

నాడు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై పోరాటం కనుక ఆరెస్సెస్‌ తన కార్యకర్తలను పెద్ద ఎత్తున పంపించింది. నేడు బీజేపీ అధికారంలో ఉంది కనుక అన్నా హజారే ఉద్యమానికి ఆరెస్సెస్‌ కలిసి వచ్చే అవకాశం లేదు. అరవింద్‌ కేజ్రివాల్‌ బృందం అండ అంతకన్నా లేదు. నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా, అవినీతి కుంభకోణాలు నాడంతగా లేవు. నాడు టెలికాం, బొగ్గు కుంభకోణం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ స్కామ్‌ మన్మోహన్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణం కారణంగానే కేజ్రివాల్‌ ప్రధానంగా ప్రజా ఉద్యమంలోకి వచ్చారు. ఇక ఏ టీవీ అన్నా హజారేతోపాటు పడిగాపులు పడేందుకు నేడు సిద్ధంగా లేవు. చాలా టీవీలు ప్రజల గొంతును మరచిపోయి ‘హిజ్‌ వాయిస్‌’గా మారిపోయాయి. అంతర్జాతీయంగా కూడా ప్రజా ఉద్యమాల స్ఫూర్తి లేదు.

మరి, ఏ ప్రతిఫలాన్ని ఆశించి అన్నా హజారే మళ్లీ ఉద్యమం చేపట్టారో అర్థం కావడం లేదు. మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేయడానికి వచ్చారా ? మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు వచ్చారా? ఆ సంకల్పంతోనే మరో సారి ఆరెస్సెస్‌ ఆయన వెంట ఉండి ఆయన్ని పక్కదారి పట్టించిందా? కాలమే సమాధానం చెప్పాలి. గతంలో అన్నా హజారే ఒత్తిడి వల్ల ఆరుగురు మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ నుంచి తొలగించిన నాటికి నేటికి ఒక్క మహారాష్ట్రలోనే అవినీతి 600 రెట్లు పెరిగిందన్నది ఓ సర్వే అంచనా.

మరిన్ని వార్తలు