కేంద్ర మంత్రి హెగ్డే నాలుక కత్తిరిస్తే.. రూ.కోటి బహుమానం!

26 Dec, 2017 17:56 IST|Sakshi

కలబురిగి జి.పం. మాజీ సభ్యుడు గురుశాంత్‌ పట్టేదార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, బెంగళూరు(కలబుర్గి): కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్‌ పట్టేదార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనవరి 26వ తేదీ లోపు కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే నాలుకను కత్తిరించి తమకు అందించిన వ్యక్తులకు కోటి రూపాయల నగదు బహుమానం అందిస్తామంటూ షరతు విధించారు.

ప్రస్తుతం దేశ ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్న తరుణంలో ఎన్నికల్లో ఓట్ల కోసం కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డే ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందుకే ఆయన నాలుక కత్తిరించిన వ్యక్తులకు బహుమానం ప్రకటించామంటూ తమ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తూ అనంత్‌కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలు చేశారని, రాజ్యాంగాన్ని విమర్శించే వారెవరైనా సరే దేశ ద్రోహులేనని అన్నారు. ఇటీవల అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య వైషమ్యాలను రగిలిస్తున్న కేంద్ర మంత్రి హెగ్డేపై తక్షణం ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని గురుశాంత్‌ పట్టేదార్‌ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు