మోసపు విధానానికే మోదీ సర్కారు మొగ్గు!

5 Feb, 2019 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం.

అమెరికా, యూరప్‌ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్‌ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది.


20 వేల రూపాయలకు లోపయితే
ఎవరైనా 20 వేల రూపాయలు, అంతకులోపు విరాళాలు ఇస్తే వారు తమ గుర్తింపును వెల్లడించాల్సి అవసరం లేదు. గతంలో అన్ని పార్టీలకు 20 వేల రూపాయలే ఎక్కువగా వచ్చేవి. లక్ష రూపాయలు ఇవ్వదల్చిన దాతలు కూడా దాన్ని ఐదు భాగాలుగా విడగొట్టి 20 వేల రూపాయల చొప్పున ఇచ్చేవాళ్లు. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి.


ఎన్నికల బాండుల్లో బేజేపీకే 95 శాతం
2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే.

భారతీయ స్టేట్‌ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్‌ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది.

నల్లడబ్బుకే ప్రాధాన్యత
దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.

>
మరిన్ని వార్తలు