కొత్త సంవత్సరంలో ప్రధాని ఎవరు?

1 Jan, 2019 15:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాలకు సంబంధించి 2018 సంవత్సరం అసంతృప్తిగానే ముగిసిపోయింది. 2019 సంవత్సరంలోకి అడుగుపెట్టే నాటికి పాలకపక్ష భారతీయ జనతా పార్టీ కొంత పతనమైంది. కాంగ్రెస్‌ పార్టీ కొంత బలం పుంజుకున్నా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 48 ఏళ్లకు కూడా పెద్దగా ఎదిగినట్లు కనిపించడం లేదు. దేశ ప్రయోజనాలకన్నా స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దేశ యవనికపై మంచుపొర కప్పేసినట్లు భవిష్యత్‌ రాజకీయాలు అస్పష్టంగానే ఉన్నాయి. 2013లో ఇదే కాలానికి రాజకీయ వాతావరణం ఎండలో చలికాచుకున్నట్లు వెచ్చగా, అతి స్పష్టంగా కనిపించింది. కొత్త సంవత్సరంలో ఏ పార్టీ కేక్‌ కట్‌ చేస్తుందో దాదాపు తేలిపోయింది. ఇప్పడు ఆ సీన్‌ గల్లంతయింది. అయోమయం నెలకొంది.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించిన రాజకీయ నాయకులు అలసిపోయారు. వారి ప్రసంగాలను వినీ వినీ ప్రజలకు బోరుకొట్టింది. నాటి ఎన్నికల వేడిని నేటికీ కొనసాగించేందుకు మీడియా ఒక్కటే పడరాని పాట్లు పడుతోంది. రోజువారి రాజకీయ విశ్లేషనల పేరిట టీఆర్‌పీ రేట్ల కోసం టీవీ ఛానళ్లు కుస్తీ పడుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలం ఇటీవలి రాజకీయ చరిత్రలో ఉద్రేకపూరిత ఉద్విగ్నమైనదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక ఘర్షణలు, సామాజిక సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గడచిన సంవత్సరం మూక హత్యలు, మూఢ నమ్మకాలు పెరిగాయి. అన్నింటికంటే నకిలీ వార్తల చెలామణి పెద్ద నోట్ల రద్దుకంటే సంచలనం సృష్టించాయి.

2018 సంవత్సరంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే వేడెక్కించాయి. ఆ ఎన్నికలు పాలకపక్ష బీజేపీని దాదాపు మోకాళ్లపై నిలబెట్టాయి. బ్రాహ్మణిజాన్ని వంట పట్టించుకున్న రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఫలితాలను చేపట్టబోయే అధ్యక్ష పదవికి ప్రతిఫలంగా అందించారు. అప్పటినుంచి రాహుల్‌ గాంధీ ‘వన్‌ మేన్‌ మిషన్‌’ లా రాజకీయ రంగంలో పరుగు మొదలు పెట్టారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదన్న రాజకీయ వాతావరణంలో ‘ఎవరైనా ఫర్వాలేదు, మోదీ తప్ప’ అన్న పరిస్థితిని తీసుకొచ్చారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రధాన మంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు. మరోమారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు తెరపైకి రావచ్చు. కార్యకర్తలే పునాదిగా ఎదిగిన బీజేపీ–ఆరెస్సెస్‌ల క్రమశిక్షణకు భిన్నంగా ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతున్న నరేంద్రమోదీ పట్ల పాలకపక్షంలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. గతంలో ఊహించినట్లుగా పాలకపక్ష ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతత్వంలో మహా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండకపోవచ్చు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అఖండ విజయంతో బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. మహా కూటమికి బదులుగా పలు చిరుకూటములు ఏర్పడవచ్చు. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సమసిపోయిన నేటి రాజకీయాల్లో రాజకీయ శత్రువంటూ లేకుండా పోయారుకనుక ఏమైనా జరగవచ్చు! రాజకీయ వాతావరణం పట్ల స్పష్టత రావాలంటే మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం వాతావరణం గురించి వర్ణించాలంటే బిజినెస్‌లో చెప్పే ‘వీయూసీఏ’ (అస్పష్టత, అనిశ్చిత, సంక్లిష్టత, సంధిగ్ధత)లా ఉంది.


 

మరిన్ని వార్తలు