మోదీ ‘బిల్లులు’ ఎవరు చెల్లిస్తున్నారు?

12 Feb, 2019 16:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన జనవరి ఒకటవ తేదీ నుంచి 42 రోజుల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 పర్యటనలు జరిపారు. ఆయన ఈ పర్యటనల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ ఏర్పాటు చేసిన పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఉదాహరణకు జనవరి 3వ తేదీన పంజాబ్‌లో పర్యటించిన ఆయన జలంధర్‌లో ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ను అధికార హోదాలో ప్రారంభించారు. ఆ తర్వాత గురుదాస్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అదే విధంగా జనవరి 5వ తేదీన నరేంద్ర మోదీ ఒడిశాలోని బారిపడకు వెళ్లి అధికార కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

అధికార కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలను కలపడం వల్ల బిజీగా ఉండే ప్రధానమంత్రులకు బోలడంత ప్రయాణ సమయం కలసి వస్తుంది. అయితే ప్రయాణ ఖర్చుల సంగతి ఏమిటీ? అధికారిక కార్యక్రమాల కోసం వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బీజేపీకి ఖర్చు కలసి వస్తుందా? బీజేపీయే ఖర్చును భరించడం వల్ల పీఎంవో కార్యాలయానికి ఖర్చు కలసి వస్తుందా? ఇరు వర్గాలు ఖర్చులను పంచుకుంటాయా ? ఖర్చుల విషయంలో అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను పీఎంవో ఎలా వేరు చేస్తోంది ? పీఎంవో కార్యలయానికున్న నిబంధనల ప్రకారం ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడే ఆయన ప్రయాణ ఖర్చులను భరించాలి. పార్టీ కార్యక్రమాలకు హాజరయినప్పుడు పార్టీయే భరించాల్సి ఉంటుంది.

రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించారు. అయితే ఆయన అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను ఎప్పుడు కలపలేదు. నరేంద్ర మోదీ ఇప్పుడు రెండింటిని కలపారు కనుక ప్రయాణ ఖర్చులను ఎవరు, ఏ మేరకు భరిస్తున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఇదే విషయమై మీడియా ఇటీవల పీఎంవో కార్యాలయానికి లేఖలు రాసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫిబ్రవరి 9వ తేదీన ఆయన అస్సాం వెళ్లి, అక్కడి నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లారు. ఆనవాయితీ ప్రకారం దాన్ని రెండు పర్యటనలుగా పేర్కొనాల్సిన పీఎంవో ఒకే పర్యటనగా పేర్కొంది. ఈ లెక్కన మోదీ జనవరి ఒకటవ తేదీ నుంచి  27 పర్యటనలు చేయగా, పీఎంవో 12 పర్యటనలు చేసినట్లు పేర్కొన్నది. జనవరి 4వ తేదీన నరేంద్ర మోదీ మణిపూర్, అస్సాంలో చేసిన పర్యటన, జనవరి 22వ తేదీన వారణాసిలో చేసిన పర్యటన వివరాలు అసలు లేవు. ఆయన చేసిన 27 పర్యటనల్లో 13 పర్యటనలకు సంబంధించి ఎలాంటి కేటగిరీ లేదు. అధికార పర్యటనకు వెళ్లారా ? ప్రైవేటు పర్యటనకు వెళ్లారా లేదా విదేశీ పర్యటనకు వెళ్లారా? అన్న కేటగిరీలు తప్పనిసరి పేర్కొనాలి. ఖర్చులు ఎవరు భరించాలో తెలియడం కోసమే ఈ విభజన.

నరేంద్ర మోదీ 2014 మే నెల నుంచి 2017 ఫిబ్రవరి మధ్యన జరిపిన 128 అనధికార పర్యటనలకు పీఎంవో కార్యాలయం భారత వైమానిక దళానికి 89 లక్షల రూపాయలను చెల్లించిందంటూ ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ ఓ వార్తను ప్రచురించడంతో ఆ డబ్బును తాము పీఎంవో కార్యాలయానికి ‘రీయింబర్స్‌’ చేశామంటూ బీజేపీ వివరణ ఇచ్చింది. అయితే అందుకు ఎలాంటి సాక్ష్యాలు చూపలేదు. అంతేకాకుండా పీఎంవో మార్గదర్శకాల ప్రకారం ప్రధాన మంత్రి అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించే మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయకూడదు. పార్టీ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎలాంటి విమర్శలైన చేయవచ్చు. మొదట్లో మోదీ కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించారు. ఆ తర్వాత ఏ కార్యక్రమంపై ఎక్కడికెళ్లినా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మన్మోహన్‌ సింగ్‌ మొదటిసారి ప్రధాన మంత్రిగా ఐదేళ్లలో 368 రోజులు విదేశాల్లో పర్యటించగా, రెండో పర్యాయం 284 రోజులు విదేశాల్లో పర్యటించారు. అదే నరేంద్ర మోదీ ఇప్పటికే 565 రోజులు విదేశాల్లో పర్యటించారు.


 

మరిన్ని వార్తలు