ఏ రాణిదో గెలుపు పురాణం?

26 Apr, 2019 23:35 IST|Sakshi

పోటీలో అందాలరాణి బొబ్బితా, క్వీన్‌ ఓజా

వీరిలో ఎవరు గువాహటికి కాబోయే రాణి?

ఈశాన్య భారతంలోని గువాహటి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల పక్షాన ఎన్నికల బరిలోకి దిగిన ఇరువురు రాణీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇద్దరిలో ఒకరు రెండు దశాబ్దాల క్రితం గువాహటి అందాల సుందరిగా ఎన్నికైన బ్యూటీక్వీన్‌ అయితే, మరొకరు నిజంగానే రాజకుటుంబీకురాలు. దీంతో ఇక్కడ  కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తోన్న ఒకనాటి అందాల రాణి బొబ్బిత శర్మపై ఇక్కడి ప్రజలు అభిమానాన్ని చాటుకుంటారా? లేక బీజేపీ బరిలోకి దింపిన రాజవంశీకురాలు ఓజాకి జనం పట్టంగడతారా? అని ఈశాన్య భారతమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మంగళవారం ఎన్నికలు జరగగా ప్రజల గుండెల్లో  ఏ రాణి  గూడు కట్టుకుని ఉందో మే 23న వచ్చే ఫలితాలు తేల్చనున్నాయి.

ఈ ఇద్దరు రాణుల్లో ఎవరు గెలిచినా 1977లో ఈ స్థానంనుంచి ప్రాతినిధ్యం వహించిన రేణుకా దేవి బర్కాకటీ తర్వాత తొలిసారిగా మళ్ళీ ఈ ప్రాంతా నికి ఐదోసారి మరో మహిళ సారథ్యం వహిస్తున్నట్టవుతుంది. అయితే రెండేళ్ళు గువాహటి మేయర్‌గా పాలానానుభవం గడించిన ఓజా తనను ఎన్నుకుంటే ‘‘రాణిగా కాకుండా ప్రజలకు సేవకురాలిగా పనిచేస్తా’’ అంటూ స్థానిక ప్రజల మనసుదోచుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరికీ చాలా దగ్గరి పోలికలున్నాయి. వీరు 1985లో రాజకీయ రంగప్రవేశం చేసారు. బొబ్బితా శర్మ కాంగ్రెస్‌లో చేరితే, అసోం గణపరిషత్‌లో ఓజా చేరారు. ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2011 ఎన్నికల్లో తూర్పు గువాహటి నుంచి ఓజా అసోం గణపరిషత్‌ నుంచి పోటీ చేసి ఓడిపోతే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బొబ్బితా శర్మ కూడా ఓటమిని చవిచూడక తప్పలేదు.

మరిన్ని వార్తలు