కర్ణాటక: తీర్పు తికమక

15 Apr, 2019 02:24 IST|Sakshi

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భిన్న తీర్పులు

ఈసారి బీజేపీకే అనుకూలమంటోన్న సర్వేలు

ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అని సామెత!. పొరుగున ఉన్న కర్ణాటక మరీ ఉలిపి కట్టె ఏమీ కాదు కానీ, కొంచెం తేడా అని మాత్రం చెప్పాల్సిందే. ఎలాగంటారా? ఇక్కడి ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీరుగా.. లోక్‌సభకు మాత్రం ఇంకో తీరుగా ఓటేస్తారు. అంతే!.

17వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక రెండు దశల్లో పోలింగ్‌ జరుపుకోనుంది. గత ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ఓటర్లు ఎలా ఓటేస్తారనేది ఆసక్తికరం. దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు కర్ణాటకలో గెలుపు తోడ్పడుతుందన్న భారతీయ జనతా పార్టీ  ఆశలు ఆశలుగానే ఉండిపోయేందుకు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్న ఓటర్ల ప్రాధాన్యాలు ఒక కారణమని విశ్లేషకుల అంచనా. గత లోక్‌సభ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే ఉన్న మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 17 దక్కించుకుంది. కానీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాత్రం దక్కలేదు. మరి తాజా ఎన్నికల పరిస్థితి ఏమిటన్నది వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ వచ్చిన ఓట్లు మాత్రం కాంగ్రెస్‌ కంటే తక్కువ. ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలైన ఓట్లను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 స్థానా ల్లో బీజేపీకి ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 43.4 శాతం ఓట్లతో బీజేపీకి 17 స్థానాలు దక్కగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆధిక్యం లభిం చింది. వీటిల్లో ఓటు శాతం 36.34 మాత్రమే కావడం గమనార్హం.

ఈసారి ఏమవుతుందో?
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌ వేర్వేరుగా పోటీ చేశాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొంటున్నాయి. ఈ లెక్కన గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు పడిన ఓట్లు.. అసెంబ్లీ ఎన్నికల లెక్కలను కలిపి చూస్తే.. కూటమికి దాదాపు 56 శాతం ఓట్లతో 21 స్థానాలు.. 36 శాతం ఓట్లతో బీజేపీకి ఏడు స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కేవలం లెక్కలు మాత్రమేనని.. రాజకీయాల్లో ఒకటికి ఒకటి కలిపినంత మాత్రాన ఫలితం రెండు అని కచ్చితంగా చెప్పలేమని, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీకే లాభం ఎందుకంటే?
రాజకీయాల్లో పరిస్థితులు తారుమారయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదని అంటారు. కర్ణాటక లోక్‌సభ విషయంలోనూ ఇదే జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది తరువాత ఎన్నికలు జరగనుండటం వల్ల ప్రజల ఆలోచనల్లో, అభిప్రాయాల్లో చాలా మార్పు వచ్చి ఉంటుందని అంచనా. పైగా స్థానిక సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో నిర్దిష్ట పార్టీలకు ఓటేసిన వారు.. లోక్‌సభలోనూ అదే తీరున ఓటేస్తారని అంచనా వేయడం కష్టం. అంతేకాక రెండు పార్టీలు కలిసి కూటమి కట్టినంత మాత్రాన ఆ రెండు పార్టీల కార్యకర్తలు అందరూ గంపగుత్తగా కూటమికి ఓట్లు వేస్తారని లెక్క వేయలేం. పైగా అటు కాంగ్రెస్‌లో.. ఇటు జేడీఎస్‌లోనూ అంతర్గత కుమ్ములాటలు బాగా ఉండటం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో జేడీఎస్‌కు బలమైన ఒక్కళిగలు, కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న కురబలు ఉప్పు నిప్పుగా ఉండటమే కాకుండా.. ఎదుటివారి ఓటమికి లోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే వేర్వేరుగా పోటీ చేస్తే వచ్చే ఫలితాల కంటే ఉమ్మడి పోటీ వల్ల వచ్చేవి కొంత మెరుగ్గా ఉంటాయని అంచనా.

అంచనాలన్నీ అనుకూలంగానే..
కర్ణాటక ఓటరు తీరును దృష్టిలో ఉంచుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కొంచెం లాభం కలిగే అవకాశం ఉంది. గత ఎన్నికలు అన్నింటినీ పరిశీలిస్తే.. కేంద్రంలోనూ, కర్ణాటకలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దాఖలాలు లేవు. ఓటర్లు కూడా లోక్‌సభకు ఒక పార్టీకి, అసెంబ్లీకి ఇంకోదానికి ఓటేయడం కద్దు. 2013 మేలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని గద్దె దించేసి కాంగ్రెస్‌కు అధికారమివ్వగా.. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 17 స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్‌ –జేడీఎస్‌ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే.. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించుకునే లక్ష్యంతో బీజేపీ మోదీని ఎక్కువసార్లు ప్రచారానికి తీసుకొస్తున్నదని అంచనా.

మరిన్ని వార్తలు