‘కర్ణాటక’ ఎటువైపు..?

11 May, 2018 03:19 IST|Sakshi

‘అహిందా’పై సిద్దరామయ్య ఆశలు

రైతు ఆత్మహత్యలు, నీటి సమస్యలే బీజేపీ అస్త్రాలు

కింగ్‌మేకర్‌ జేడీఎస్‌ ఆలోచనేంటి?

మే 15న ఫలితాల్లో గెలిచేదెవరు?  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసినా ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లకు గాను ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. శనివారం (మే12న) ఎన్నికలు జరగనుండగా.. మే 15న (మంగళవారం) ఫలితాలు వెలవడనున్నాయి. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వాన్ని గద్దె దించేస్థాయిలో కనిపించకపోవడం, లింగాయతులకు మతపరమైన మైనార్టీ హోదా వంటివాటిపైనే కాంగ్రెస్‌ నమ్మకం పెట్టుకుంది. బెంగుళూరు నగర సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగు నీటి సమస్యలు వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది.

 ‘భాగ్య’ రేఖ కలిసొచ్చేనా?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, అల్ప సంఖ్యాకవర్గాల (అహిందా)కోసం ‘భాగ్య’ పేరుతో చేపట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయని సిద్దరామయ్య ఆశతో ఉన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ సర్కారుపై జనంలో అసంతృప్తిపై బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణ శక్తి, వాగ్ధాటితో సృష్టించే ‘మేజిక్‌’పైనే బీజేపీ ఆధారపడుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం, పార్టీకి తగినన్ని నిధులుండటం బీజేపీకి వరంగా మారింది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేస్తాడని పేరున్న అమిత్‌షాపైనా రాష్ట్ర బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 2% ఎక్కువ ఓట్లురావొచ్చని సర్వేలు చెబుతుండగా, ఎన్నిక సమయానికి తమ నిర్ణయాన్ని మార్చుకునే ఓటర్లు గణనీయంగానే ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో ఒక పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

జేడీఎస్‌ కింగ్‌ మేకరా?
జేడీఎస్‌ కిందటి ఎన్నికల్లో బీజేపీతో సమానంగా 40 సీట్లు తెచ్చుకుంది. అయితే ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య కాస్త తగ్గినా.. పాలకపక్షాన్ని నిర్ణయించే స్థితిలో ఈ పార్టీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2004–2007 మధ్య కాంగ్రెస్, బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా కొనసాగిన చరిత్ర జేడీఎస్‌ది. త్రిశంకు సభ జోస్యాల నేపథ్యంలో జేడీఎస్‌ రహస్య అవగాహన కుదుర్చుకుందనే చర్చ జరుగుతోంది. సిద్దరామయ్యతో దేవెగౌడకున్న వ్యక్తిగతవైరం కారణంగా.. బీజేపీ వైపే మొగ్గుచూపే అవకాశాలెక్కువ.

ఒకే రాష్ట్రం–ఆరు విభిన్న ప్రాంతాలు!
దక్షిణాదిలో ఆరు విభిన్న సామాజిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులున్న రాష్ట్రం కర్ణాటక. బాంబే కర్ణాటకలో బీజేపీకి, హైదరాబాద్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌కు కొంతవరకు సానుకూలత ఉంటుంది. కరావళిగా పిలిచే కోస్తా కర్ణాటకలో మైనారిటీల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నందున మతపరమైన ఉద్రిక్తల కారణంగా బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచే వీలుంది. మధ్య కర్ణాటక లింగాయతుల ఆధిపత్యం. ఇక్కడ బ్రాహ్మణులేగాక కొత్తగా దళితుల్లోని మాదిగలు కమలం వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇక బెంగళూరు ప్రజల్లో ఉండే అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని బీజేపీ అంచనావేస్తోంది. పాత మైసూరు ప్రాంతం ఇన్నాళ్లుగా జేడీఎస్‌కు ఎక్కువసీట్లు అందిస్తోంది. ఎప్పటిలాగే ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలూ ఎక్కువే
కర్ణాటకలో భిన్న మతాల ప్రజలతోపాటు కన్నడేతర భిన్న భాషలు మాట్లాడే భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. ఉత్తర కర్ణాటకలో మరాఠీలు, తూర్పు, బెంగళూరు, దాని చుట్టు పక్కల జిల్లాల్లో తెలుగు, తమిళం మాట్లాడేవారు ఎక్కువ. ఈ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు దాదాపు 25 మంది వరకు ఎన్నికవుతున్నారు. కర్ణాటక గెలుపు రాహుల్‌ నాయకత్వానికి మంచి ఊపు ఇస్తుంది. అధ్యక్ష పదవి చేపట్టాక తొలి గెలుపు ఇదే అవుతుంది. రాబోయే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కర్ణాటక ఎన్నికలు కీలకమయ్యాయి.


అమాత్యుల్లో ఆందోళన!
ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల ముఖ్యనేతల్లో టెన్షన్‌ తీవ్రస్థాయికి చేరింది. గత అనుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్, బీజేపీ, చెందిన మంత్రులు, మాజీ మంత్రుల్లో ఈ ఎన్నికల్లో నెగ్గుతామా లేదా అన్న మీమాంస పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న జి.పరమేశ్వర గత ఎన్నికల్లో (2013) కొరటగేరే స్థానంలో పోటీచేసి ఓడిపోయారు. దీంతో సీఎంగా పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. మొదట చాముండేశ్వరీ నుంచి బరిలో దిగిన సిద్దరామయ్య.. గెలుపు అంత సులువు కాదని గ్రహించి.. బాదామీ నుంచి పోటీకి పట్టుబట్టారు.

గతంలో మట్టికరిచిన మంత్రులు
     ► 1972 ఎన్నికల్లో అప్పటి సీఎం వీరేంద్ర పాటిల్‌ మంత్రివర్గమంతా ఓటమిపాలైంది.
    ► 1983లో సీఎం ఆర్‌.గుండూరావు సహా మంత్రివర్గ సహచరులంతా (రాజశేఖరమూర్తి మినహా) పరాజయం పాలయ్యారు. ఫలితంగా కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది.
     ► 1999లోనూ సీఎం జేహెచ్‌ పటేల్, కేబినెట్‌ మంత్రులంతా ఓడిపోయారు.
  

 –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా